వేలం వేదిక రియాద్‌!

వేలం వేదిక రియాద్‌!– నవంబర్‌ 24, 25న ఆటగాళ్ల వేలం
ముంబయి : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2025 ఆటగాళ్ల వేలం కొత్త వేదికకు మారనుంది. గత ఏడాది దుబారులో నిర్వహించగా.. ఈ సీజన్‌ ఈవెంట్‌ను సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ ఆలోచన చేస్తోంది. లండన్‌, సింగపూర్‌లను సైతం పరిశీలించినా.. ప్రసారదారు సౌలభ్యత, సారూప్య సమయ వేళలతో రియాద్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ప్రాంఛైజీలకు త్వరలోనే అధికారికంగా బీసీసీఐ నుంచి సమాచారం అందనుంది. బీసీసీఐ ఉన్నతాధికారులు, ఐపీఎల్‌ టీమ్‌, పది ప్రాంఛైజీల ప్రతినిధులు సహా జియో, డిస్నీస్టార్‌ సిబ్బంది మూడు రోజుల పాటు రియాద్‌లో ఉండేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.