సంక్రాంతి వంటి క్రేజీ కలెక్షన్ సీజన్‌ని ఏ నిర్మాత కూడా మిస్ చేసుకోడు. పైగా దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. నిర్మాతలే కాదు హీరోలు సైతం సంక్రాంతి బరికి సై.. అనడంలో ఏమాత్రం వెనుకంజ వేయరు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా నాలుగు సినిమాలు తగ్గేదేలే.. అన్నట్టుగా సంక్రాంతి పోటీలోకి దిగాయి. ‘గుంటూరు కారం’తో మహేష్‌బాబు, ‘సైంధవ్’తో వెంకటేష్, ‘నా సామిరంగ’తో నాగార్జున వంటి బడా హీరోలు ఈసారి రంగంలోకి దిగారు. మూడు బడా హీరోల సినిమాలు బరిలో ఉన్నప్పటికీ ‘హను-మాన్’ కూడా దీటుగా పోటీకి సై.. అంది. పెద్ద హీరోల సినిమాలు కావడంతో ‘గుంటూరుకారం’, ‘సైంధవ్’, ‘నా సామిరంగ’ చిత్రాలకు కౌంట్ పరంగానే కాకుండా క్వాలిటీ థియేటర్లు దొరికాయి. వీటితో పోలిస్తే ‘హను-మాన్’ చిత్రానికి ఈ స్థాయి థియేటర్లు దొరకలేదు. ప్రేక్షకుల ముందుకు రాకముందు ఈ నాలుగు సినిమాల స్టేటస్ ఇది. ఇక సంక్రాంతి బరికి తెర లేపుతూ ఈనెల 12న మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ‘గుంటూరుకారం’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడం, విడి విడిగా వీరిద్దరికి మంచి సక్సెస్ ట్రాక్ ఉండటంతో భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. వన్‌మ్యాన్ షోగా మహేష్‌బాబు మంచి మార్కులు సొంతం చేసుకున్నప్పటికీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం బలం ఈ సినిమాకి పనిచేయలేదు. త్రివిక్రమ్ సినిమాల్లో ఉండే మ్యాజిక్ ఏ కోశానా కనిపించకపోవడం ఈ చిత్రానికి బిగ్గెస్ట్ మైనస్‌గా నిలిచి, నిరుత్సాహపరిచింది. ‘గుంటూరుకారం’ వంటి పెద్ద సినిమాకి పోటీగా తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందిన ‘హను-మాన్’ సైతం ఇదే రోజు రిలీజ్ అయ్యింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అందరికీ సుపరిచితుడైన తేజా సజ్జా హీరోగా పలు సినిమాల్లో నటించినప్పటికీ ఓ మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అభిరుచిగల దర్శకుడిగా ప్రశాంత్ వర్మ ఇప్పటికే పేరు సొంతం చేసుకున్నారు. మనందరికీ బాగా తెలిసిన హనుమంతుడిని ఎన్నో సవాళ్ళని ఎదుర్కొని సంక్రాంతి బరిలోకి దిగిన ‘హను-మాన్ సినిమాది మామూలు విజయం కాదు.
అసాధారణ విజయం..
అంతకంటే మించి స్ఫూర్తిదాయక విజయం.. పరిశ్రమకు ఓ పెద్ద గుణపాఠం నేర్పిన విజయం కూడా.. పెద్ద హీరోల సినిమాలతో పోటీ పడుతూ సరైన థియేటర్లు దొరక్క, దొరికిన కొన్ని థియేటర్లలో కూడా కొన్ని చోట్ల సినిమాని ప్రదర్శించకపోయినప్పటికీ సంక్రాంతి బరిలోకి దిగిన ‘హను-మాన్’ కంటెంట్, విజువల్స్‌తో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకునేలా చేసింది. ‘గుంటూరు కారం’, ‘సైంధవ్’, ‘నా సామిరంగ’ .. ఈసారి సంక్రాంతి బరిలోకి దిగాయి. వీటితోపాటు ‘హను-మాన్’ కూడా అమీతుమీ తేల్చుకునేందుకు పోటీలోకి దిగి, విశేష ప్రేక్షకాదరణతో భారీ విజయాన్ని అందుకుంది.
– రెడ్డి హనుమంతరావు