ఆగస్టు 23 సీపీఎస్‌ ఉద్యోగులకు బ్లాక్‌డే

– ప్రజాపాలనలో పాత పెన్షన్‌ పునరుద్ధరణ జరగాలి
– నేడు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు : టీఎస్‌సీపీఎస్‌ఈయూ అధ్యక్షులు స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) విధానం అమల్లోకి వచ్చిన రోజు ఉద్యోగులకు చీకటి రోజు అని టీఎస్‌సీపీఎస్‌ఈయూ విమర్శించింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించాలని కోరింది. ఈ మేరకు టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్‌, కోశాధికారి నరేష్‌గౌడ్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాత పెన్షన్‌ పునరుద్ధరణ కోసం శుక్రవారం నిర్వహించే బ్లాక్‌ డేలో భాగంగా అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని కోరారు. భోజన విరామ సమయంలో 28 జీవో ప్రతులని దహనం చేయాలని పిలుపునిచ్చారు.
అన్ని శాఖల ఉద్యోగ, ఉపాధ్యాయులు జిల్లా కేంద్రాల్లో 28 జీవో ప్రతులను దహనం చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 2014, ఆగస్టు 23న 28 జీవో ద్వారా సీపీఎస్‌ విధానాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని గుర్తు చేశారు. దానికి నిరసనగా ఆగస్టు 23ని ఉద్యోగుల పాలిట చీకటి రోజుగా భావించి బ్లాక్‌ డే జరుపుకోవాలని కోరారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.