ఆమె వేధింపులకు కోడళ్లు అదిరి పడాల్సిందే. సూటిపోటి మాటలకు తోడికోడళ్లు బెదరాల్సిందే. ఆమె నోటికి భర్త జడవాల్సిందే. ఆమె ఏం చేసినా ఇరుగుపొరుగు వారు నోరు మూసుకోవాల్సిందే… అగ్ర హీరోలు ఎన్టీఆర్, ఎన్నార్ అయినా సరే మిన్నకుండిపోవాల్సిందే. ఇదంతా కేవలం వెండి తెరకే పరిమితం. వ్యక్తిగతంగా ఆమె అంటే అందరికీ ఎంతో అభిమానం. సినిమాల్లో ఆమెను చూసి బెదిరిపోయిన వాళ్లే ఎదురుగా కనిపిస్తే ఎంతో ఆప్యాయంగా పలకరించేవాళ్లు. ఆ నటి మరెవరో కాదు… తెలుగువారికి పరిచయం అవసరంలేని సహజ నట కళా శిరోమణి సూర్యకాంతం. సుమారు అయిదు దశాబ్దాలపాటు నటిగా ముద్ర వేసి, అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్న దిగ్గజ నటి. ఈ అక్టోబర్ 28న ఆమె శతజయంతి ప్రారంభం సందర్భంగా ప్రత్యేక వ్యాసం.
సూర్యకాంతం 1924 అక్టోబర్ 28న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటకష్ణరాయపురంలో జన్మించింది. 14వ సంతానంగా జన్మించిన సూర్యకాంతం, తన ఆరేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయింది. పెద్దక్క, బావల దగ్గర పెరిగిన సూర్యకాంతం చిన్న వయసులోనే పాటలు పాడటంతో పాటు నాట్యం నేర్చుకొంది. కొద్దిగా అల్లరిగా ఉండటం వల్లనో ఏమో చదువు పెద్దగా ఒంట పట్టలేదు. సినిమాల మీద మక్కువ కలిగింది. పల్లెటూరి నుంచి కాకినాడకు ఎడ్లబండిలో వెళ్ళి పధ్వీరాజ్ కపూర్ నటించిన హిందీ చిత్రాలు చూసేది. వీటి ప్రభావంతో సినిమాల్లో నటించాలనే నిర్ణయం తీసుకుని వాళ్ళ పెద్దక్క ఒప్పుకోకపోయినా, తల్లిని వెంటబెట్టుకుని మద్రాసు చేరుకుంది.
సినీరంగ ప్రవేశం
సూర్యకాంతం మద్రాసు చేరుకున్నాక 1946 లో తొలిసారి ‘నారదనారది’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘గహప్రవేశం’ సినిమాలో మంచి అవకాశం వచ్చింది. అయితే సూర్యకాంతంకు హీరోయిన్‌గా నటించాలనే కల ఉండేదట. ఆ అవకాశం కూడా తనను వెతుక్కుంటూ వచ్చింది. కానీ తన కల అయిన హీరోయిన్ అవకాశాన్ని వదులుకుంది. అందుకు ఓ కారణం కూడా ఉంది. సౌదామిని సినిమాలో కథానాయికగా సూర్యకాంతంకు అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం కావడంతో ఆమె ఆ అవకాశాన్ని వదులుకున్నారట. గాయాలు మానిన తర్వాత 1950లో ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘సంసారం’ సినిమాలో రేలంగికి తల్లిగా సూర్యకాంతం నటించింది. ఆ సినిమాలో సూర్యకాంతానికి తోడు మరో గయ్యాళి వెంకమ్మ పాత్రను బెజవాడ కాంతమ్మ పోషించింది. ఈ చిత్రం సూర్యకాంతం కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ చిత్రం ఆమెను కయ్యాలమారిగా.. గయ్యాళి పాత్రలకు తగినట్లుగా చూపించింది. దీంతో ఒక్కసారిగా అవకాశాలు పెరిగిపోయాయి. 1951లో శ్రీరాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ కె.బి. నాగభూషణం దర్శకత్వంలో నిర్మించిన ‘సౌదామిని’ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ప్రక్కన హీరోయిన్ హేమవతి పాత్ర కోసం సూర్యకాంతానికి కబురెళ్లింది. అయితే అంతకుముందే ఓ కారు ప్రమాదం వల్ల ఆమె ముఖం నిండా గాయాలయ్యాయి. దీంతో హీరోయిన్ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ‘సంసారం’ చిత్రం చూసిన ఓ బాలీవుడ్ నిర్మాత హిందీ సినిమాలో సూర్యకాంతాన్ని హీరోయిన్‌గా బుక్ చేశారు. తనకు ఇవ్వజూపిన పాత్రకోసం గతంలో మరొక నటిని ఎంపికచేసి తొలగించినట్లు సూర్యకాంతానికి తెలిసింది. మానవత్వ విలువలు పాటించే సూర్యకాంతానికి ఆ నిర్మాత చేసిన పని నచ్చలేదు. వెంటనే మరో కారణం చూపి ఆ అవకాశాన్ని ఇష్టపూర్వకంగానే వదలుకుంది. ఒకరిని బాధపెట్టి సంతోషంగా ఉండటం ఆమెకు నచ్చేది కాదు. ఆ తర్వాత ఆమెకు హీరోయిన్ పాత్రలు రాకపోవడంతో సహాయ పాత్రలు… ముఖ్యంగా గయ్యాళి పాత్రలకే పరిమితం కావలసివచ్చింది.
అంతవరకూ గయ్యాళి పాత్రలకు పేరెన్నికగన్న శేషుమాంబను పక్కనబెట్టి 1953లో వచ్చిన ‘కోడరికం’ చిత్రంతో గయ్యాళి పాత్రలకు ట్రేడ్ మార్క్‌గా సూర్యకాంతం నిలిచింది. తన హావభావాలతో వెటకారం రంగరించిన గయ్యాళితనాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న సూర్యకాంతం ఆ తరువాత ‘చిరంజీవులు’, ‘మాయాబజార్’, ‘దొంగరాముడు’, ‘తోడికోడళ్ళు’, ‘మాంగల్యబలం’, ‘వెలుగునీడలు’, ‘అత్తా ఒకింటి కోడలే’, ‘ఇల్లరికం’, ‘భార్యాభర్తలు’ వంటి అనేక సినిమాలలో వైవిధ్యభరితమైన సహజ నటనను ప్రదర్శించింది. భానుమతి నిర్మించిన అన్ని సినిమాల్లోనూ సూర్యకాంతం తప్పకుండా కనిపించేది. ఆమె గయ్యాళితనమంతా సినిమాల్లోనే. బయట మాత్రం చాలా సున్నిత మనస్కురాలు. ఓ సినిమాలో చిత్తూరు నాగయ్యను నానామాటలు తిట్టే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. షాట్ అయిపోయిన తరువాత ఆమె నాగయ్య కాళ్ళమీద పడి క్షమాపణలు వేడుకుంది. చక్రపాణి లాంటి అగ్ర నిర్మాతే సూర్యకాంతాన్ని దష్టిలో వుంచుకొని ‘గుండమ్మ కథ’ సినిమా నిర్మించారంటే… పైగా అక్కినేని, ఎన్టీఆర్ వంటి అగ్రహీరోలు నటించిన ఆ సినిమాకి ‘గుండమ్మ కథ’ అనే టైటిల్ పెట్టి విజయం సాధించారంటే సూర్యకాంతం ఎంతటి మహానటో అర్ధమవుతుంది. ”లవకుశ, చక్రపాణి, చిరంజీవులు, గుడిగంటలు, కులగోత్రాలు, మూగమనసులు, దాగుడుమూతలు, ఇల్లరికం, కన్యాశుల్కం, భాగ్యరేఖ, చరణదాసి, అప్పుచేసిపప్పుకూడు, జయభేరి, శాంతినివాసం, ఇద్దరు మిత్రులు, ఉమ్మడికుటుంబం, వెలుగునీడలు, కలసిఉంటే కలదుసుఖం, మంచిమనసులు, రక్తసంబంధం, సిరిసంపదలు, డాక్టర్ చక్రవర్తి, మురళీకష్ణ, చదువుకున్న అమ్మాయిలు, సంగీతలక్ష్మి, బ్రహ్మచారి, బుద్ధిమంతుడు, ఆత్మీయులు, అందాలరాముడు, ముత్యాల ముగ్గు, రాధాకష్ణ, సెక్రటరీ, పెళ్ళిచూపులు, వన్ బై టు, బుజ్జిబాబు, యమగోల, హై హై నాయకా, గోవిందా గోవిందా” వంటి చిత్రాలు ఆమె అద్బుత నటనకు కొన్ని ఆనవాళ్ళు మాత్రమే. ఇక ఆవిడ నటించిన చివరి చిత్రం ”ఎస్పీ పరుశరాం”. సూర్యకాంతం కేవలం గయ్యాళి పాత్రే కాకుండా తల్లిగా ఉదాత్తమైన పాత్రలు పోషించింది. రేలంగి, రమణారెడ్డి వంటి హాస్యనటుల సరసన, ఎస్.వి.రంగారావు, గుమ్మడి వంటి నటుల సరసన కూడా నటించి ఆయా పాత్రలకనుగుణంగా నటనను ప్రదర్శించింది. నటిగా వెండితెరపై సూర్యకాంతం వరుస సినిమాలతో దూసుకు పోతుంది. ఏ సినిమా అయినా సరే, అందులో ఏదో ఒక లేడీ నెగిటీవ్ పాత్రలో సూర్యకాంతం ఉండి తీరాల్సిందే అన్న పరిస్థితి అప్పట్లో ఉండేది. సూర్యకాంతం నటించే పాత్రలు మరెవరూ నటించలేరని.. తమ సినిమాకు ఆమె అవసరం ఉంటుందని, ప్రేక్షకులకు బాగా దగ్గరవుతామని నిర్మాతలు భావించేవారు. అందుకే ఆమె కోసం ప్రత్యేక పాత్రలు కల్పించి మరీ తీసుకునేవారని అంటారు. ఇలా సుమారు ఐదు దశాబ్దాలపాటు నటిగా తనదైన ముద్రవేసిన సూర్యకాంతం.. అశేష అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. తుదిశ్వాస వరకు ఆమె దాదాపు 750 కి పైగా సినిమాల్లో నటించింది. ఒకవేళ బతికుంటే ఇంకా ఎన్ని సినిమాలు చేసుండేవారో. 70 ఏళ్ల వయసులో 1994వ సంవత్సరం డిసెంబర్ 18న మధుమేహవ్యాధితో మూత్రపిండాలు చెడిపోయి ఆమె కన్నుమూసింది.
కుటుంబం
సూర్యకాంతం 1950 లో హైకోర్టు జడ్జి అయిన పెద్దిభోట్ల చలపతిరావును వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత కూడా ఆమె తన నటన జీవితాన్ని కొనసాగించారు. అయితే సంతానం లేకపోవడంతో సోదరుని కుమారుడిని దత్తత తీసుకున్నారు.
అప్పటి మద్రాసు హైకోర్టు జడ్జిగా ఉన్న చలపతిరావు సూర్యకాంతం కోసం తన కారులో స్టూడియోల ముందు వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది వారిద్దరిమద్య ఉన్న అన్యోయానికి నిదర్శనంగా సినీ పరిశ్రమలో చెప్పుకునేవారు.
పది భాషలు నేర్చుకున్న సూర్యకాంతం
సూర్యకాంతం కు చదువుమీద యెంతో ఆసక్తి. చిన్నవయసులోనే చదువుకు స్వస్తి చెప్పడంతో గ్యాడ్యుయేట్ కావాలనే కోరిక అలాగే వుండిపోయింది. స్కూల్ చదువులు పెద్దగా చదువుకోలేకపోయిన ఆమె దాదాపు పది భాషల్లో అనర్గళంగా మాట్లాడేది. బొంబాయిలో కొన్ని సినిమా షూటింగులకు హాజరైనప్పడు, ఆ స్వల్ప వ్యవధిలోనే మరాఠీ భాషను నేర్చుకుంది. మద్రాసు వచ్చాక ఇంగ్లీషు, యాభైయేళ్ల వయసులో ఫ్రెంచ్ భాషను కూడా నేర్చుకోవడం ఆమెకు భాషమీద వున్న ఆసక్తికి తార్కాణమని చెప్పుకోవాలి. బెంగాలీ అంటే కూడా సూర్యకాంతంకు చాలా ఇష్టం… దిన పత్రికలు, పుస్తకాలు, నవలలు, పురాణేతిహాసాలు బాగా చదివేది. దినపత్రిక ఉదయం రావడం ఆలస్యం అయితే చాలు పేపరు బారును నిలదీసేది.
నిజజీవితంలో భయస్తురాలు..
సూర్యకాంతంకి ఎవరి మీద అభిమానం, గౌరవం ఉండేదో, వాళ్లకి ఏదైనా అవుతుందేమోనని భయం ఎక్కువగా ఉండేది. జగపతి పిక్చర్స్ అధినేత వి.బి. రాజేంద్రప్రసాద్‌గారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన త్వరగా కోలుకోవాలని మొక్కుకుంది. ఆయనకు తగ్గాక అందరికీ భోజనాలు పెట్టింది. ఎవరికి ఒంట్లో బావుండకపోయినా, వాళ్ల తరపున మొక్కులు తీర్చేది. వారి గోత్రం తెలియకపోతే, దేవుడి గోత్రం, నక్షత్రం చెప్పేది.
శత్రువునైనా క్షమించే గుణం
శత్రువు ఇంటికి వచ్చినా వాళ్లని క్షమించి, అన్నం పెట్టేది. పచ్చళ్లు, దోస ఆవకాయ అంటే ఇష్టం. వంటల మీద పుస్తకం వేసింది. లైట్ కలర్స్ బాగా ఇష్టపడేది. నలుపు రంగంటే అస్సలు ఇష్టపడేది కాదు. కారు కొన్నప్పుడు లైట్ బ్లూ బుక్ చేస్తే, వాళ్లు బ్లాక్ కలర్ ఇచ్చారు. అప్పుడు గొడవ పెట్టి, మార్చుకుంది. సూర్యకాంతమే స్వయంగా కారు డ్రైవ్ చేసేది.
సూర్యకాంతాన్ని రాళ్లతో కొట్టిన గ్రామస్తులు
గయ్యాలి అత్త పాత్రలో నటించే సూర్యాకాంతాన్ని ఒకానొక సందర్భంలో ఊరివాళ్లు రాళ్లతో కొట్టినట్లు అప్పట్లో వార్తలు హల్‌చల్ చేశాయి. అసలు విషయానికి వస్తే.. కోడల్ని రాచి రంపాన పెట్టడం, పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టి విడగొట్టడం, భార్యాభర్తల మధ్య చాడీలు చెప్పి వారి బంధాలు వేరు చేయడం… ఇలా ఎన్నో రకాల నెగిటివ్ పాత్రలకు జీవం పోసిన సూర్యాకాంతాన్ని చాలా మంది జనాలు, నిజ జీవితంలో కూడా ఆమె అలాగే ఉంటుందని భావించేవారు. ఒకసారి సినిమా షూటింగ్ కోసం ఓ గ్రామానికి వెళ్లారు. ఆ సినిమాలో హీరో నాగేశ్వరరావు. ఆ గ్రామంలో సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకొని కొంతమంది ఆడవాళ్లు, మగవాళ్లు వచ్చారు. అక్కడ సూర్యకాంతాన్ని చూసి ఒక్కసారే ఆగ్రహం వ్యక్తం చేసి ఆమెపై రాళ్లు విసిరారు. దీంతో షూటింగ్ సభ్యులంతా ఆశ్చర్యపోయారు. తనపై గ్రామస్థులు ఎందుకు రాళ్లు విసిరారో సూర్యాకాంతానికి అర్థం కాలేదు.. అంతలోనే అక్కడికి హీరో నాగేశ్వరరావు వచ్చి గ్రామస్థులను ఆపి ఎందుకు ఆమెను రాళ్లతో కొడుతున్నారని అడిగారు. దానికి సమాధానంగా కొంతమంది మహిళలు ఆమె కోడళ్లను ఏడిపిస్తుంది.. పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతుంది, నిండు సంసారాలను కూల్చి వేస్తుందని చెప్పారు. దీంతో నాగేశ్వరరావు, సూర్యకాంతం మొదట షాక్ తిన్నా.. నెమ్మదిగా వారికి సర్ధి చెప్పారు. తాము కేవలం ఆ సినిమాకు సంబంధించిన పాత్రల్లో మాత్రమే నటిస్తాం.. నిజ జీవితంలో సూర్యకాంతం చాలా మంచిది.. అందరినీ దగ్గరకు తీసుకుంటుంది.. అందరితో స్నేహంగా ఉంటుంది. ఆమె స్వయంగా అందరికీ వంటలు చేసుకొని మరీ తీసుకు వస్తుంది.. ఎంతోమందికి ఆర్థిక సహాయం చేశారు అని చెప్పారు. దీంతో జనాలు శాంతించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. తర్వాత సూర్యాకాంతం ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తాను చేస్తున్న అత్త క్యారెక్టర్ జనాల్లో అంత ప్రభావం చూపించిందా? అందుకే నన్ను రాళ్లతో కొట్టారా? నేను చేస్తున్న పాత్రలకు తగు న్యాయం చేస్తున్నానని అప్పుడు అనిపించిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.
దయ, దాతత్వం మెండు
సూర్యకాంతంకు దయాగుణం, దాతత్వగుణం మెండు. ఆమె ఎందరో అనాధ పిల్లలకు, విద్యాసంస్థలకు, గ్రంధాలయాకు ధనసహాయం చేసింది. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారికి సంతప్తికరంగా భోజనం పెట్టి, ఆదరించి సాగనంపేది. స్టూడియోలో షూటింగుకు వెళ్ళేటప్పుడు పిండివంటలతోబాటు వివిధ వంటకాలతో చేసి, వాటిని పెద్ద క్యారియర్లనిండా తీసుకెళ్లి సహ నటీనటులకు ఆప్యాయంగా వడ్డించేది. షూటింగ్ జరిగే సమయంలో ఆవిడ చేతి వంటను రుచిచూడని ఆనాటి నటీనటులు లేరంటే అతిశయోక్తికాదేమో. ఈ సంఘటనను కూడా ఎంతో ఆప్యాయంగా చెప్పుకుంటారు సినీ పెద్దలు. సూర్యకాంతం మనుషులను ఎలా నమ్మేవారో, ఆమె మనసు ఎంత సున్నితమైందో చెప్పే విషయాన్ని రమాప్రభ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చింది. సూర్యకాంతంకు పిల్లలు లేరు. చివరి రోజుల్లో తన ఆస్తి మొత్తం తన సోదరులకు చెందే విధంగా వీలునామా రాయమని ఆమె తరపు న్యాయవాదిని కోరగా, ఆ లాయర్ ఆమెను దారుణంగా మోసం చేశాడు. వీలునామా తన పేరు మీదే రాసేసుకున్నాడు. ఈ విషయం చివరి వరకు సూర్యకాంతంకు తెలియదు. సూర్యకాంతం మరణం తరువాత ఆమె సోదరునికి ఈ విషయం తెలిసి ఆయన కూడా గుండెపోటుతో మరణించాడంట.
వ్యాపార పటిమగల మహిళ
సూర్యకాంతం మంచి వ్యాపార పటిమగల మహిళ. ఆవిడ పాత ఇళ్ళు కొనుగోలుచేసి, వాటిని ఆధునీకరించి మంచి ధరకు అమ్మేది. అంతేకాదు, పాత కార్లను కొని వాటికి రిపేర్లు చేయించి, రంగులు వేసి సెకండ్ హ్యాండ్ బజార్లలో అమ్మకానికి పెట్టేది. ఇది కేవలం ధనార్జనకోసం చేసిన ప్రవత్తి కాకపోయినా, వ్యాపార సరళి మీద ఆమెకు వున్న ఆసక్తికి గుర్తు మాత్రమే.
పురస్కారాలు
1994లో సూర్యకాంతం కన్నుమూసినా, ఆమెని పద్మ పురస్కారాలతో సత్కరించకపోయినా, తెలుగు ప్రేక్షకులు అంతకంటే గొప్ప కీర్తిప్రతిష్టలతో సూర్యకాంతంని వారి గుండెల్లో పదిల పరుచుకున్నారు. హస్యనటశిరోమణిగా, రంగస్థల శిరోమణి ఇలా ఎన్నో బిరుదులు, అవార్డులు అందుకున్న సూర్యకాంతం జీవిత చరమాంకంలో ఆమెకు తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించారు. 2021 లో సహజనటి సూర్యకాంతానికి తపాలాశాఖ అరుదైన గౌరవం కల్పించింది. ఆమె పేరున తపాలాశాఖ ప్రత్యేక కవరు కాకినాడలో విడుదల చేసి గౌరవించింది. ఆమె వంటలమీద ఒక అద్భుతమైన పుస్తకాన్ని ప్రచురించారు కూడా.
– పొన్నం రవిచంద్ర, 9440077499