ఔరా! కలికాలం

Yay! Kalikalamఅక్కడ ఏది ఎక్కడ వుండాలో అక్కడ వుండదు. అంతా ఉల్టా సీదా, సీదా వుల్టా. తలకిందుల తమాషా. తిమ్మిబమ్మి బమ్మితిమ్మి అవుతుంది. చివరికి ఏది తిమ్మో ఏది బమ్మో అర్థం కాదు. అందుకే అదో అరణ్యం. అరణ్యం అంటే కీకారణ్యమో, దండకారణ్యమోకాదు. జనారణ్యం. జనారణ్యం అంటే మనుషులుండే అరణ్యం. మనుషులనగానెవరు? ఉట్టి అమాయకులు. నోట్లో వేలు పెడితే ఏం చెయ్యాలో తెలియని వాళ్లు. నల్లనివన్నీ పాలని, తెల్లనివన్నీ నీళ్లని అన్నా సరే అనేవాళ్లు. మనుషులంతా అమాయకులైతే మరి అసాధ్యులెవరౌతారు. రింగుమాష్టర్లెవరౌతారు. వాళ్ల కంట్లో వాళ్లే వేళ్లు పెట్టుకుని పొడుచుకునేట్టు చేసేవాళ్లెవరౌతారు?
అక్కడో గాడిద వుంది. అది అరిస్తే నాలుగు ఆమడల దాకా వినిపిస్తుంది. ఓండ్ర పెట్టే గాడిదకి ముందు కాళ్ల కన్నా వెనక కాళ్లకి బలం ఎక్కువ. దానికి చిత్తుకాగితాల చెత్తకుండీ దొరికితే చాలు.
అక్కడో గ్రామసింహం వుంది. అది గర్జించలేదు కనుక మొరుగుతుంది కనుక దాన్ని కుక్క అని అంటారు. పుణ్యానికి దొరికే పిక్కల కోసం మొరిగి, మాంసం వున్నా లేకున్నా దవడలకు పని వుండటానికి ఎముకొకటి దొరికితే చాలు కురుకురు అంటుంది.
అక్కడో పంది వుంది. అది గురగురమంటూ రొచ్చులో, బురదగుంటలో దొర్లుతుంది. మురికి అనేదే దానికి అలంకారం. దులుపుకుపోవడం దాని నైజం. ఇదీ అదీ అని లేదు, ఏది దొరికినా చాలు, సూదిలాంటి మూతితో పీల్చి పిప్పిచేస్తుంది.
గాడిద ఓండ్ర పెట్టడంలో రకరకాల మ్యూజిక్‌ కాంబినేషన్లు కనిపెట్టింది. ఒకసారి ఒక రాగం ఎత్తుకుంటే మరోసారి మరోరాగం అందుకునేది. ఓ కన్ను మూసి ఒక రాగాన్ని, రెండు కళ్లు మూసి ఇంకో రాగాన్ని ఆలపించేది. రెండు కళ్లకి వేరు వేరు రాగాలు సెట్‌ చేసి కచేరీలు చేసేది.
కుక్కేం తక్కువా? మొరగడంలోనే ప్రయోగాలు సాధించింది. మొరగడంలోనే కసినంతా కూరింది. మొరగడంలోనే కరిచి కండతీస్తా, కరిచి తోలు తీస్తానని అందరినీ హడలుగొట్టేది. బెదరగొట్టేది. చెదరగొట్టేది.
పందినయినంత మాత్రాన పనికిరానా? దొంగతనంగా మెక్కినంత మాత్రాన దొరనుకానా? అని గుర్రుమంది పంది. ఆ గుర్రు శబ్దం గాడిద ఓండ్రకీ, కుక్క మొరుగుకీ తక్కువేం కాదు. సాగదీస్తే అదీ ఒక రాగం కాకపోదు అనుకున్న పంది పొట్టి తోక ఊపుతూ గుర్రుగుర్రుమంటూ తిరిగేది.
మూడూ మూడు రాగాలు తీస్తూ జనారణ్యంలో తిరిగే ఈ మూడింటి ‘గురి’ అనుకోండి, ‘గోల్‌’ అనుకోండి, ‘లక్ష్యం’ అనుకోండి… ఒక్కటే ఒక్కటి! జనాన్ని తమవైపు తిప్పుకోవడమే అది.
గాడిద జనాన్ని వలలో వేసుకోవడానికి పిట్టల దొర వేషం కట్టింది. నాకధికారాలివ్వండి చూపిస్తా తడాఖా అంటూ పాత చెక్క తుపాకీని గాలిలో పేల్చింది. చింత చెట్టుకు కొబ్బరికాయలు కాయిస్తానని వాగ్దానం చేసింది.
కుక్క జనాన్ని బుట్టలో వేసుకోడానికి ఉత్తర కుమారుడి వేషం కట్టింది. తను మొరిగితే సింహం గర్జించినట్టే అంది. తను లేకపోతే నదులు ఎండిపోతాయని చుక్కనీరు దొరక్క జనం ఆగమైపోతారని, వాళ్ల కోసం తను ఆగమైపోయినా సరే అని, కాళ్ల సందున ఉండాల్సిన తోకను పైకెత్తి నిలబెట్టింది.
జనాన్ని బుట్టలోకి దించడానికి పంది మామంచి అన్నయ్య వేషం కట్టింది. పది మందినీ వెంటేసుకుని తిరుగుతూ జనారణ్యాన్ని స్వర్గం చేస్తానని, స్వర్ణయుగం తెస్తానని హామీలిచ్చింది. తను లేకపోతే జనారణ్యం ఎడారి అయిపోతుందని, అందరినీ ఓదారుస్తూ గురగురమంటూనే గిరగిర తిరిగింది.
ఇలాగ ఎవరిగోల వారిదే నన్నట్టుగా తిరిగితే లాభం లేదు. ఒకరిమీద ఒకరు బురద చల్లితేనే మేలు అనుకున్నవి గాడిదా, కుక్కా, పందీ.
జనంలోకి జొరబడి గాడిద కుక్క వివ్యాసం గల జంతువు అన్నది నిన్నటి మాట అని, ఇప్పటి కుక్క అప్పటి కుక్క కానేకాదని, ఇది విశ్వాసం ఒదిలేసిన కుక్క అని, ఇక పందికి అంటుకున్న బురద గంగా, కావేరీ, గోదావరీ నదుల్లో ఈదినా కొట్టుకుపోదని, అసలు కుక్కా పందీ ఇద్దరూ మిత్రులేనని అన్నది.
జనంలోకి జొరబడి కుక్క గాడిద ఒంటికి ఉన్నదంతా బూడిదేనని, లోకంలో గుండె జబ్బులకు దాని సంగీతమే కారణమని, దానికి వెనుక కాళ్లతో తన్నే బుద్ధి ఏనాటికీ మారదని, ఏమరుపాటున ఉంటే ఫెడీ ఫెడీమని తన్నేస్తుందని గాడిదా, పందీ ఇద్దరూ మిత్రులేనని అన్నది.
జనంలోకి జొరబడి పంది ఇప్పటి కుక్కకు విశ్వాసమే లేదన్నమాట నిజమేనన్నది. గాడిద ఒంటికి వున్నది బూడిదేనని, అది వెనకకాళ్ల కిక్కులతో జనం పళ్లూడగొడ్తుందని, అసలు గాడిదా కుక్కా ఇద్దరూ మిత్రులని అన్నది. ఈ మూడింటి మాటలూ విన్న జనానికి ఏమీ అర్థం కాలేదు. అసలు ఎవరెవరు ఎవరెవరి మిత్రులు? కుక్కా పందీనా? గాడిదా కుక్కనా? గాడిదా పందీనా? అని తలలు బాదుకున్నారు. ఒకరు చెప్పేది ఇంకొకరు చెప్పడం లేదు. ప్రతి ఒక్కరూ తాము తప్ప తత్తిమా ఇద్దరూ ద్రోహులనీ, దుర్మార్గులనీ అంటున్నారు. ప్రతి ఒక్కరూ మరో ఇద్దరు మంచి మిత్రులంటున్నారు అని తలలు పట్టుకున్నారు.
కుక్క గాడిదను తరుముతుంది. గాడిద వెనుక కాళ్లతో పందిని తన్నాలనుకుంటుంది. పంది కుక్కనీ, గాడిదనీ బురద గుంటలోకి తొయ్యాలని చూస్తుంది. ఇవి ఒకదాన్నొకటి కుమ్ముకుంటుంటే జనం నోరుతెరిచి చూస్తుంటారు. గాడిదా, కుక్కా, పందీ వేరువేరుగా పోరాడుతున్నట్టగుపించినా, వాటి పోరాటం మాత్రం ఒక్కదాని కోసమే. వాటి గోల్‌, లక్ష్యం మాత్రం ఒక్కటంటే ఒక్కటే!. కలికాలం.. ఆ కలికాలం, మామూలు జనాల కాలం కాదు. మంచి జనాల కాలం కాదు. గాడిదల కాలం, కుక్కల కాలం, పందుల కాలం. ఔరా… కలికాలం.

– చింతపట్ల సుదర్శన్‌, 9299809212