ఎస్ఎంసీ కమిటీలకు మంగళం.?

– బడుల నిర్వహణ బాధ్యత స్వశక్తి సంఘాలకే
– ఎస్ఎంసి స్థానాల్లో అమ్మ ఆదర్శ కమిటీలు
– ఛైర్ పర్సన్ గా మహిళ సమైక్య సంఘం అధ్యక్షురాలు
– కన్వీనర్ గా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ పాఠశాల నిర్వహణలో కొన్నేళ్ళుగా చరిత్ర కలిగిన పాఠశాల యాజమాన్య కమిటీలు (ఎస్ఎంసి)లకు ప్రభుత్వం మంగళం పాడింది. ప్రభుత్వ బడుల బలోపేతంలో కిలకమైన నిర్వహణ బాధ్యతలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు ఇవ్వడంతో ఇక ఎస్ఎంసి లేనట్లే అని నిర్దారణ అయింది.2019లో పాఠశాలల్లో ఎస్ఎంసి ఏర్పాటు జరగగా రెండేళ్లుగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉండేది.కానీ పదవీకాలం ముగిసినప్పటికి అప్పటి ప్రభుత్వం తిరిగి నూతన కమిటీలు ఏర్పాటు చేయకుండా పాత కమిటీలకే పదవీకాలం కొనసాగిస్తూ వచ్చింది.నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఎస్ఎంసి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ సైతం ఇచ్చింది.పలువురు కోర్టును ఆశ్రయించగా ఎన్నికలకు బ్రేక్ పడింది.అది అలా ఉండగా ప్రభుత్వం అనూహ్యంగా అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేయడంతో ఇక ఎస్ఎంసి ఊసే లేకుండా పోయింది.
కొత్త ఆలోచన ప్రభుత్వం శ్రీకారం..
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, నిర్వహణ పర్యవేక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.పాటశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది.ప్రభుత్వ పాఠశాల పర్యవేక్షణ బాధ్యత ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అప్పగించింది.అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల పేరిట ఇక నుంచి పాఠశాలల పర్యవేక్షణ కొనసాగనుంది. ఇదివరకు ప్రభుత్వ పాఠశాలల్లో మేనేజ్మెంట్ కమిటీలు (ఎస్ఎంసి) పాఠశాలల నిర్వహణ బాధ్యత చేపట్టిన విషయం తెలిసిందే.రెండేళ్ల క్రితం వాటి కాలం ముగిసినప్పటికి ప్రభుత్వం పదవీకాలం పొడగిస్తూ వచ్చింది.ప్రభుత్వ ఆదేశాలతో ఎస్ఎంసి కమిటీల స్థానంలో అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసింది.తాగునీటి సౌకర్యం, మరమ్మతులు,తరగతి గదులు విద్యుదికరణ,పారిశుద్ధ్య నిర్వహణ,సోలార్ ప్యానళ్ల ఏర్పాటు,యూనిపాంల కుట్టు బాధ్యత అమ్మ ఆదర్శ కమిటిల ద్వారా నిర్వహిస్తున్నారు.
రెండేళ్ల కాలపరిమితి..
అమ్మ ఆదర్శ కమిటీలకు పాఠశాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది హాజరు ఇతర కార్యక్రమాలను సభ్యులు సమీక్షించాల్సి ఉంటుంది.కమిటీల రెండేళ్ల కాలపరిమితితోపాటు పాఠశాలల నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వ ఆదేశాల మేరకు కమిటీల ఎంపిక ప్రక్రియలో అధికారులు ఉన్నారు.గ్రామ సమైక్య సంఘం అధ్యక్షురాలు చైర్ పర్సన్ గా, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్ గా, ఒకటి నుంచి 10వ తరగతి వరకు ప్రతి విద్యార్థి తల్లులు ముగ్గురు చొప్పున సభ్యులుగా కమిటీ ఉన్నారు.నిధుల విడుదల సంబంధించి చైర్ పర్సన్,కన్వీనర్ కలిసి జాయింట్ చెక్ పవర్ ఉంటుంది.పాఠశాలల్లో అభివృద్ధి పనులకు సంబంధించి రూ.25 వేల పనుల వరకు టెండర్ లేకుండా, అంతకు మించి ఉంటే కమిటీలు జిల్లా సమాఖ్యల ద్వారా కలెక్టర్ కు నివేదిస్తాయి.రూ.లక్ష దాటితే కలెక్టర్ పర్యవేక్షణలో పనులు సాగనున్నాయి.పనులు పూర్తియినట్లుగా ప్రధానోపాధ్యాయుడు దృవీకరిస్తేనే బిల్లుల చెల్లింపు జరుగుతుంది.
మండల పరిస్థితి ఇలా..
1, మండలంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 37 ఉన్నాయి.ఇందులో 27 ప్రాథమిక పాఠశాలలు, 02 ప్రాథమికోన్నత పాఠశాలలు, 05 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఒక కెజిబిబి,ఒక ఆదర్శ పాఠశాల ఉన్నాయి. ఇందులో 1853 మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారు.
2, మండలంలో మొత్తం మహిళ స్వయం సహాయక సంఘాలు 27, విఓఎలు 27, మొత్తం స్వశక్తి సంఘాలు 684,అందులో సభ్యుల సంఖ్య 7.540 ఉన్నారు.
అన్నీ పాఠశాలల్లో ఏర్పాటు చేశాం..దేవా నాయక్. ఇంఛార్జి ఎంఈఓ 
ప్రభుత్వం ఆదేశాల మేరకు మండలంలోని అన్ని పాఠశాలల్లో  అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేశాం.గ్రామ మహిళ సంఘం అధ్యక్షురాలు చైర్ పర్సన్ గా, కన్వీనర్ గా ప్రధానోపాధ్యాయుడు,సభ్యులుగా విద్యార్థుల తల్లులను చేర్చాము.