టీమ్‌ ఇండియాకు ఆసీస్‌ ప్రధాని విందు

Aussie Prime Minister's dinner for Team India– పార్లమెంట్‌ హౌస్‌లో మాట్లాడిన రోహిత్‌
– కోహ్లి, బుమ్రాతో సరదాగా ముచ్చటించిన ఆంటోని
నవతెలంగాణ-కాన్‌బెర్రా
బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ తొలి టెస్టులో 295 పరుగుల భారీ విజయాన్ని భారత క్రికెటర్లు ఆస్వాదిస్తున్నారు. పెర్త్‌ టెస్టులో అద్భుత విజయం అందుకున్న టీమ్‌ ఇండియా.. పింక్‌ బాల్‌ వార్మప్‌ కోసం ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాకు చేరుకుంది. ఇక్కడ రెండు రోజుల పింక్‌ బాల్‌ వార్మప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఎలెవన్‌తో భారత జట్టు తలపడనుంది. శనివారం, ఆదివారం పింక్‌ బాల్‌ వార్మప్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో కాన్‌బెర్రాకు వచ్చిన టీమ్‌ ఇండియాకు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోని అల్బానిస్‌ ఆత్మీయ విందు అందించారు. ఆస్ట్రేలియా పార్లమెంట్‌ హౌస్‌లో గురువారం భారత క్రికెటర్లను ఆయన కలిశారు. ఈ విందులో ప్రధానమంత్రి ఎలెవన్‌ క్రికెటర్లు సైతం పాల్గొన్నారు. భారత్‌, ఆస్ట్రేలియా రెండో టెస్టు ఆడిలైడ్‌లో డిసెంబర్‌ 6 నుంచి ఆరంభం కానుంది.
ప్రధాని ముచ్చట: భారత క్రికెటర్లను కలిసిన ఫోటోలను ఆస్ట్రేలియా ప్రధానమంత్రి తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. పార్లమెంట్‌ హౌస్‌లో జరిగిన ఈ విందు భేటిలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భారత క్రికెటర్లను ఆంటోనికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా జశ్‌ప్రీత్‌ బుమ్రా, విరాట్‌ కోహ్లితో ఆంటోని సరదాగా ముచ్చటించాడు. పెర్త్‌ టెస్టులో కోహ్లి జోరు గురించి మాట్లాడిన ఆంటోని.. బుమ్రాతో అతడి బౌలింగ్‌ శైలిని ప్రశంసించాడు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరెంద్ర మోడికి చేరవేయాల్సిన సందేశాన్ని ఆంటోని క్రికెటర్లతో పంచుకున్నాడు.
మనది బలమైన బంధం: భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆస్ట్రేలియా పార్లమెంట్‌హౌస్‌లో మాట్లాడారు. ఇరు దేశాల క్రికెట్‌ సంబంధాల గురించి రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘క్రీడలు, వాణిజ్యంలో భారత్‌, ఆస్ట్రేలియాలది సుదీర్ఘ బంధం. క్రికెట్‌లో ఆస్ట్రేలియా సవాల్‌తో కూడుకున్న జట్టు. ఇక్కడి అభిమానులు, పోటీతత్వంతో కూడిన ఆటగాళ్లు ప్రత్యేకం. ప్రపంచంలోనే ఉత్తమ జట్లలో ఒకటైన ఆసీస్‌తో తలపడటం ఎప్పుడూ బాగుంటుంది. ఆసీస్‌ నేలపై విజయం సాధించాం. ఇటీవల పెర్త్‌ టెస్టులోనూ గెలుపొందాం. ఇదే జోరు సిరీస్‌ అసాంతం కొనసాగించాలని అనుకుంటున్నాం. మమ్మల్ని ఆహ్వానించి, విందు అందించిన ప్రధాని ఆంటోనికి ధన్యవాదాలు’ అని రోహిత్‌ శర్మ అన్నాడు.