మెల్బోర్న్: బాక్సింగ్ డే (రెండో)టెస్ట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్స్ నిరాశపరిచారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 318పరుగులకు ఆలౌటైంది. తొలిరోజైన మంగళవారం ఆట ముగిసే సమయానికి 3వికెట్ల నష్టానికి 187పరుగులు చేసి పటిష్టంగా ఉన్న ఆసీస్‌ను పాకిస్తాన్ బౌలర్లు కట్టడి చేశారు. అమీర్ జమాల్(3/64)కి తోడు షాహిన్ షా, హంజా, హసన్ అలీ రెండేసి వికెట్లు పడగొట్టారు. దీంతో ఆసీస్ భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి 6వికెట్ల నష్టానికి 194పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా(62), కెప్టెన్ మసూద్(54) అర్ధసెంచరీలతో మెరిసారు. బుధవారం ఆట నిలిచే సమయానికి వికెట్ కీపర్ రిజ్వాన్(29), అమీర్ జమాల్(2) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ కెప్టెన్ కమిన్స్‌కు మూడు, లియాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. తొలిటెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు 360పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచి 1-0 ఆధిక్యతలో ఉంది.