– కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
నవతెలంగాణ-ఆసిఫాబాద్
జిల్లాను అన్ని రంగాలలో ముందుండేలా జిల్లా అభివృద్ధికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్‌లతో కలిసి జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాలలో ముందు ఉంచేలా అధికారులు సమిష్టిగా కృషి చేయాలని, ప్రజల సంక్షేమం దిశగా సమన్వయంతో పనిచేయాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి విష జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వాతావరణ సమతుల్యత లక్ష్యంగా చేపట్టి వన మహోత్సవంలో జిల్లాలోని అన్ని శాఖలకు 53 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని, ఈనెల 31 వరకు లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళా శక్తి పథకంతో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజాపాలన దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. జిల్లాలో రహదారులు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.