ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) అనేది న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. జన్యుపరంగా, జీవశాస్త్ర ఆధారిత రుగ్మతగా దీనికి గుర్తింపు ఉన్నది. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఏప్రిల్ 2ను అంతర్జాతీయ ఆటిజండేగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కలిగిన వారికి అవగాహన పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఐరాస యుఎన్ అసెంబ్లీ తీర్మానం ద్వారా సభ్య దేశాలను ఆదేశించాయి. మానవ హక్కులను మెరుగుపరచడం కోసం ఐరాస అమలు చేస్తున్న వాటిల్లో ప్రపంచ ఆటిజం దినోత్సవం ఒకటి. సభ్యదేశాలు, ఇతర సంబంధిత సంస్థలకు యుఎన్ లేదా ప్రభుత్వేతర సంస్థలు, ప్రయివేటు సెక్టార్‌తో సహా అన్ని స్థాయిలలో ఆటిజం గురించి అవగాహన పెంచుకోవడానికి సభ్య దేశాలు కృషి చేయాలని ఐరాస నిర్ణయించింది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌పై ఐరాస చేసిన ఒప్పందాలను దేశంలో అమలు చేస్తా మని భారత ప్రభుత్వం కూడా సంతకం పెట్టింది.కానీ ఇప్పటివరకు ఆటిజం పట్ల కేంద్రం సరైన కృషి చేయడం లేదు.
ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు ఎదుర్కొనే ఇబ్బందు లను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆటిజంతో బిడ్డను కలిగి ఉండటం అంత తేలికైన పరిస్థితి కాదు. పిల్లవాడు అనేక సామాజిక సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా, పిల్లలకు భద్రత, గౌరవం, అవకాశాలను నిర్ధారించడం తల్లిదండ్రులకు కూడా కష్టమవుతుంది. ఇది జీవితంలో మొదటి మూడేండ్లలో అభివృద్ధి చెందుతుంది. సామాజిక, కమ్యూనికేషన్ సామర్ధ్యాల పరంగా మెదడు సాధారణ అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. ఇది నాడీ సంబంధిత (నాడీ వ్యవస్థ) పరిస్థితి, దీనిలో మెదడుకు సంబంధించిన నాడీ కణాలు సమస్యలను కలిగిస్తాయి. పిల్లలకి 18 నెలల వయస్సు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు ఏదో తప్పును గుర్తిస్తారు. పిల్లవాడు ఒకటి లేదా రెండేండ్ల వయస్సు వరకు సాధారణంగా ఉంటాడు. తరువాత సామాజిక, భాషా నైపుణ్యాలను కోల్పోతారు. లక్షణాలు తేలికపాటి నుంచి తీవ్రంగా మారుతాయి. ఆటిజంతో బాధపడే పిల్లలు అందరు ఒకే రకంగా ఉండరు.
ప్రపంచంలో అత్యధికంగా అటిజం ఉన్న దేశం ఖాతార్, అత్యాల్పంగా ఉన్న దేశం ఫ్రాన్స్. ఆటిజం వ్యాధి నిర్దారణ అత్యధికంగా ఉన్న దేశం ఫ్లోరిడా. ప్రపంచ జనాభాలో ఒక శాతం మందికి ఆటిజం రుగ్మత ఉంది.2023లో యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రతి 36మంది పిల్లల్లో ఒక శాతం మంది ఆటిజంతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరం నుంచి 2023 నాటికి 178 శాతం ఆటిజం ప్రాబల్యం పెరిగింది.గత పదేండ్ల మధ్యకాలంలో 7,07,000 నుంచి 1,11,6000 మంది యుక్త వయస్సు యువకులు పాఠశాలలో ఆటిజం రుగ్మతకు అవసరమైన సేవలు పొందడం లేదు.ఆటిజం కలిగిన పెద్దల్లో 75 శాతం మంది ఉపాధి పొందడం లేదు.25 ఏండ్ల వయసు కలిగిన యువకుల్లో 50శాతం మంది ఉద్యోగం చేయలేకపోతున్నారు. ఆటిజం కలిగిన వారిలో 40శాతం మంది శబ్దం వినలేక పోతున్నారు.78శాతం మంది అటిస్టిక్ రుగ్మత కలిగిన పిల్లలు మరొక మానసిక ఆరోగ్య రుగ్మతను కలిగి ఉంటున్నారు. 80శాతం మంది ఆటిజం కలిగిన పిల్లలు నడవలేకపోవడం, రాయలేకపోవడం చేస్తున్నారు.అమెరికాలో ఆటిజం రుగ్మత కలిగిన వారి ఆరోగ్య సంరక్షణ ఖర్చు 2015లో 268 బిలియన్ డాలర్స్ ఉంటే 2025నాటికి 461బిలియన్ డాలర్స్‌కు పెరుగుతుందని అంచనా.
మన దేశంలో ప్రస్తుతం కోటి 80 లక్షల మంది ఆటిజంతో బాధపడుతున్నారని అంచనా. కానీ ప్రతి 66 మంది పిల్లలలో ఒక్కరికి ఆటిజం సమస్య ఉంది. ఆటిజం సమస్య కలిగిన పిల్లల్లో 40 శాతం మంది పిల్లలు మాట్లాడలేక పోతున్నారు.ఆటిజం బాలికల కంటే అబ్బా యిల్లో నాలుగు శాతం ఎక్కువగా నిర్ధారణ అవుతుందనీ ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ఆటిజంను కూడా అంగవైకల్యంగా గుర్తించింది. కానీ ప్రభుత్వం నేటికీ వారికి వైకల్య ధృవీకరణ పత్రాలివ్వడం లేదు. నేషనల్ ట్రస్ట్ ద్వారా ఆటిజం, సెరిబ్రల్ పాల్సి, మానసిక వికలాంగుల సంక్షేమం కోసం నేషనల్ ట్రస్ట్ ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 5 లక్షల మంది పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే నేషనల్ ఇనిస్టిట్యూట్ అఫ్ మెంటల్లి హ్యాండిక్యాపడ్ (ఎన్‌ఐఎంహెచ్) ఉంది. కానీ అక్కడ సరిపడా సిబ్బంది, పరికరాలు లేదు. జిల్లాల నుంచి ట్రీట్మెంట్ కోసం చంటి పిల్లలతో హైదరా బాద్‌కు రాకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఉచిత థెరపి సెంటర్స్ ప్రారంభించి, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మూడేండ్ల వయసు కలిగిన పిల్లలకు ఆటిజం పరీక్షలు నిర్వహించాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆటిజం స్పెషలిస్ట్ డాక్టర్స్‌ను నియమిం చాలి. ఆటిజంతో బాధపడు తున్న పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి తల్లిదండ్రులతో పాటు సమాజంలో ఆటిజంపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
– ఎం.అడివయ్య, 9490098713