ఆటో హుస్సేన్‌ టూ…. డాక్టర్‌ హుస్సేన్‌

– డాక్టరేట్‌ పొందిన అనంతారం వాసి
నవతెలంగాణ-పెన్‌ పహాడ్‌
నిరుపేద కుటుంబంలో పుట్టి ఇంటర్‌ ఫేయిల్‌ అయ్యి ఆటో డ్రైవర్‌ గా జీవితం కొనసాగించిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్‌ పట్టా పొందే స్థాయికి ఎదిగారు. మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన షేక్‌ హుస్సేన్‌ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 83వ స్నాతకోత్సవంలో డాక్టరేట్‌ పట్టా పొందారు. తెలుగులో ముస్లిం సాహిత్యం, ముస్లింవాద సాహిత్యం సమగ్ర అధ్యయనం అనే అంశంపై ప్రొ. ఎన్‌ఆర్‌ వెంకటేశం పర్యవేక్షణలో సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్‌ లభించినట్లు, ఈ పట్టాను షేక్‌ హుస్సేన్‌ రాష్ట్ర గవర్నర్‌ ఓయూ విశ్వవిద్యాలయ చాన్సులర్‌ తమిళిసై సౌందర్య రాజన్‌ అధ్యక్షత ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ దండెబోయిన రవీందర్‌, అమెరికాకు చెందిన అడోబ్‌ కంపెనీ సిఈఓ పద్మశ్రీ డా. శంతను నారాయణన్‌ల చేతుల మీదుగా అందుకున్నారు. మండలంలో తొలిసారిగా తెలుగులో డాక్టరేట్‌ సాధించిన వ్యక్తిగా షేక్‌ హుస్సేన్‌ నిలిచారు. ఇదే మండలం నుంచి డాక్టరేట్‌ అందుకున్న తొలి ముస్లింగా కూడా నిలిచారు. చిన్న, సన్నకారు రైతుకుటుంబంలో జన్మించిన హుస్సేన్‌ తల్లిదండ్రులు షేక్‌ జాన్‌ సాబ్‌(లేట్‌) అసన్‌ భీల ప్రోత్సాహంతో వ్యవసాయం నుంచి విద్యకు మళ్లారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన షేక్‌ హుస్సేన్‌ విద్య పట్ల తనకు ఉన్న ఆసక్తితో ఎంఎ, ఎల్‌ఎల్బి చేసి హైకోర్ట్‌ న్యాయవాదిగా ఎదిగారు. అదే క్రమంలో సాహిత్యంపై మక్కువతో తెలుగులో పరిశోధనకు ఉపక్రమించి, పట్టుదలతో చక్కనైన సిద్ధాంతగ్రంథాన్ని రూపొందించి ఉస్మానియా విశ్వ విద్యాలయానికి సమర్పించారు. విద్యార్థి జెఎసి నాయకునిగా తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎంతోమంది యువకులకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ వారి విద్యాప్రగతికి తోడ్పడుతున్నారు. డాక్టరేట్‌ సాధించిన షేక్‌ హుస్సేన్‌ ను అభినందిస్తూ హుస్సేన్‌ కషి ఎందరికో స్ఫూర్తినిస్తుందని గ్రామస్థులు, పెద్దలు,యువకులు, విద్యావంతులు అభినందించారు.
డాక్టరేట్‌ పురస్కారాన్ని స్వీకరించిన కాసరబాధ వాసి
నవతెలంగాణ-సూర్యపేటరూరల్‌
హైదరాబాద్‌ లోని ఓ.యూ ప్రాంగణం లో గల ఠాగూర్‌ ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం 83వ స్నాతకోత్సవంలో యూనివర్సిటీ ఛాన్స్లర్‌, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ శ్రీమతి డాక్టర్‌పపతమిలిసై సౌందర రాజన్‌, ప్రముఖ బహుళ జాతి సంస్థ అడోబ్‌ కంపెనీ సీఈవో శంతను నారాయణ్‌ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. ప్రభుత్వ పాలనా శాస్త్ర విభాగంలో సూర్యాపేట, భువనగిరి మునిసిపాలిటిలలో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ పై పరిశోధన పూర్తి చేసిన సూర్యాపేట మండల పరిధిలోని కాసరాబాద గ్రామానికి చెందిన కొల్లు శ్రీనివాస్‌ డాక్టరేట్‌ పట్టా స్వీకరించడం జరిగింది. కొల్లు శ్రీనివాస్‌ ప్రస్తుతం నడిగూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా తన పరిశోధనకు సహకరించిన పర్యవేక్షకుడు ప్రొఫెసర్‌ బి అమరేందర్‌ రెడ్డి గారికి, అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితులు , సహచర అధ్యాపకులకు కతజ్ఞతలు తెలిపారు.