ఆటో రాముడూ…

Auto Ramudu...– ఈ డ్రామాలేంటి?  లోపల సీసీ కెమెరా బిగించిన
– ఆటోలో కేటీఆర్‌ ప్రయాణం
– మహిళలకు ఉచిత ప్రయాణం వద్దా?
– బతుకే భారమైన ఆటోవాలాలు… ఆటోలను తగులబెట్టుకుంటారా?
– వారిని రెచ్చగొట్టి రాజకీయ లబ్దిపొందాలనే జూ.ఆర్టిస్టు వేషాలు
– గవర్నర్‌కు ధన్యావాదాలు తెలిపే తీర్మానంలో కేటీఆర్‌పై రేవంత్‌ ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడాన్ని స్వాగతించని బీఆర్‌ఎస్‌ నేతలు…దాంతో ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతోందంటూ డ్రామాలాతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కృష్ణానగర్‌ జూనియర్‌ ఆర్టిస్టులా ఆటో రాముడు ఆటోలో తిరుగుతూ నాటకాలడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకునేందుకు ఆటోలో తిరిగితే పర్వాలేదు…కానీ ఆటో లోపల సీసీ కెమెరా బిగించి, మరి ప్రయాణించారని మాజీ మంత్రి కేటీఆర్‌నుద్దేశించి ఎద్దేవా చేశారు. మరో నటుడు గతంలో వంద రూపాయాలు పెట్టి పెట్రోలు తెచ్చుకున్నారు, కానీ రూపాయి పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోలేక పోయారని విమర్శించారు. ఎందుకీ డ్రామాలని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ సర్కారు మహిళలకు మంత్రి పదవులు ఇవ్వకపోగా, మహిళలకు ఇస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తప్పుపట్టడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ పథకం ప్రవేశ పెట్టిన తర్వాత 15.21 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు. ఇప్పటివరకు ఆడబిడ్డల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 500.52 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. శుక్రవారం శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు లెవనెత్తిన వివిధ అంశాలకు సీఎం సమాధానమిస్తూ…తొమ్మిదేండ్లుగా అధికారాన్ని అనుభవించిన బీఆర్‌ఎస్‌నేతలు…కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండునెలలు కాముందే ఎన్నో విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఈ రెండు నెలల్లో తాము అనేక గొప్ప నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కానీ ‘బీఆర్‌ఎస్‌ నేతలు నేతలు మాత్రం కాంగ్రెస్‌ సర్కారు దివాళాతీసింది. ఖజానాలో చిల్లిగవ్వలేదు. గ్యారంటీలు అమలు కావు. కాంగ్రెస్‌ పనైపోయింది’ అంటూ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పరిపాలన తీరులో ఏమైనా లోపాలు ఉంటే చెబుతారనుకుంటే, తమ ప్రభుత్వానికి శాపనార్ధాలు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని గతంలో సంక్షోభంలోకి నెట్టిందనీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే విధంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ కోరుకుంటున్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం ఆ రకంగా చేయబోదని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2018లో రైతు బంధు పథకాన్ని ప్రారంభించిందనీ, అప్పటి నుంచి 4, 5, 9 నెలలపాటు రైతుల ఖాతాల్లో ఆలస్యంగా డబ్బు జమ చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కొద్దిగా ఆలస్యం కాగానే ఆ పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు.
భూకబ్జాదారులపై కేసులుస్మార్ట్‌సీటీ తిమింగలాలపైనా చర్యలు అసెంబ్లీ లాబీలో మంత్రి పొన్నం
కరీంనగర్‌ జిల్లాలో భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ అన్నారు. ఇప్పటికే ముగ్గురు కార్పొరేటర్లను అరెస్ట్‌ చేశామనీ, మరో 15 మందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారం ఉందని బీఆర్‌ఎస్‌, ఇతర నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. అవినీతి, అక్రమాలను సహించబోమని స్పష్టం చేశారు. ప్రయివేటు వ్యక్తుల భూములను భూకబ్జా చేసిన వారిని వదిలిపెట్టమని అన్నారు. మర్యాదగా భూములు సంబంధిత వ్యక్తులకు భూములు తిరిగి అప్పగించాలని అల్టీమేటమ్‌ ఇచ్చారు. వందలాది ఫిర్యాదులు వస్తున్నాయనీ, భూకబ్జాదారులపై కేసులు పెట్టేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు. ఇదిలావుండగా కరీంనగర్‌ స్మార్ట్‌సీటీ పనుల్లో కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని సైతం వదలబోమని ప్రకటించారు. రూ. 600 కోట్ల పనుల్లో నాణ్యతాలోపాలు ఉన్నాయనీ, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని అభిప్రాయపడ్డారు.