రామసింహ కవి ఆత్మకథ

”ఈ మలినాత్ముడనైన యొకానొక దురదృష్ట దీనమానవుని జీవన చరిత్ర యేమి, జగజ్జనాహ్లాదకరమా, హరిహర గుణానుభవమా” అనే విచికిత్సకు లోనై ‘రాఘవ పట్టణం రామసింహ కవి ఆత్మకథ’ (పేజి: 51) ను విప్పిచెప్పే ఈ అపురూపమైన పుస్తకం తెలుగు స్వీయ చరిత్రల్లో రెండు విధాలా విశిష్టమైనది. అంతంత మాత్రమే చదువుకొన్న ఒక సామాన్య మానవుని ఆత్మనివేదనం కావడం మొదటి ప్రత్యేకత. పంజాబీ భాషీయుడైన రైతుబిడ్డ ఒకవైపు నేలతల్లిని నమ్ముకొని బతుకుబండిని ఈడుస్తూ నీతిని యమాలకులోనై, మరోకవైపు చదువులతల్లి సరస్వతీదేవిని ఆరాధిస్తూ నిరాడంబరంగా, పవిత్రంగా జీవన యాత్ర గడపటం రెండవది.
కరీంనగర్‌ జిల్లా, జగిత్యాలకు దగ్గరగా వున్న రాఘవ పట్టణంలో 1857లో పుట్టి 106 ఏళ్ల సార్థక జీవితం గడిపిన సాధుజీవి స్వీయ చరిత్ర ఇది. పైలా పచ్చీసు వయస్సులో ఓ ఆవుపై దాడి చేసిన పెద్దపులితో పోరాడి, దాన్ని చంపి 1886 ప్రాంతం స్థానిక ఆంగ్లేయ డిప్యూటీ కలెక్టరుతో పది రుపాయల పురస్కారం పొందిన మగధీరుడీ సర్దార్‌ రామసింహుడు.
ఆవేశపరుడైన స్వజాతీయుడు హరిసింగ్‌ తన్ను ఆకారణంగా చంపవస్తే, తెగించి అతన్ని ప్రాణాలు తీసిన సింహకిశోర మీ రామసింగ్‌.
”చంపవచ్చిన శత్రువున్‌ జంపవలసె/ భయము లేక సత్యంబు బలుకవలసె/ లంచ మివ్వలేక శిక్షవహించ వలసె/ క్లేశ మనుకోక శిక్ష వహించవలసె” (పేజి: 33) అని నిర్వేదంతో 14 ఏళ్ల పాటు జైలుశిక్ష అనుభించిన సహనశీలుడు. సహజపండితుడైన ఈ పంజాబీబిడ్డ స్వాధ్యాయం వల్ల తెలుగు, పంజాబీ, ఉర్దూ భాషల్లో అటు కూతలోనూ, ఇటు రాతలోనూ రాటుతేలాడు.
రాఘవపట్టణం రామసింహ కవి మొత్తం 28 కృతులు రాస్తే, పట్టుమని పది రచనలే వెలుగు చూశాయి. ఆయన రాసిన సద్గురు లీల, పుత్రకామేష్ఠి, శ్రీతులసీదాసు విజయము, ఆనంద విజయము మొదలైన హరికథలు, సత్యధురంధరి, చిత్రాంగద, కలియుగ వైకుంఠము ఇత్యాది నాటకాలు నాటి తెలంగాణలో పండిత పామర్ల ప్రశంసలకు నోచుకున్నాయి. ఇక ఆయన విశ్వకర్మశతకం, రామసింహశతకం, వదాన్య శతకాల్లోని పద్యాలు సామాన్య జనుల నాలుకలపై నాట్య మాడిన సంగతికి ‘గోలకొండ కవుల సంచిక’ సాక్షీభూతం.
రామసింహ కవి జైలు శిక్ష అనుభవిస్తున్న రోజుల్లో ఏళ్ల కొద్దీ తీవ్రమైన వేదన పడుతున్న కాలంలో దైవప్రార్థనలో, కావ్యరచనలో సమయం వెళ్లబుచ్చారు. రామసింహకవి పద్యాలు, పాటలు, కీర్తనలు పరితప్త హృదయం నుంచి సహజంగా తేటతెలుగులో వెలువడ్డాయి. అందుకే అవి ఆనాటి సహదయ సామాన్య జనుల నోళ్లల్లో నానాయి. కాని ఆ పాటలు నేడు కనపడవు, వినపడవు. రామసింహ కవి సాంఘిక దురాచారాల్ని ఖండించాడు. జ్యోతిష్యం, హస్తసాముద్రికం వగైరా నమ్మ వద్దంటాడు. నేలతల్లిని నమ్ముకొని, న్యాయార్జిత విత్తంతో తృప్తిగా బతకమంటాడు. తాను అలాగే జీవితయాత్ర కొనసాగించాడు.
‘రాఘవ పట్టణం రామసింహ కవి ఆత్మకథ’- గద్యపద్యాల మేలుకలయిక. దీన్ని కష్టనష్టాల కోర్చి, పది మంది సాయంతో సర్వాంగ సుందరగా వెలుగులోకి తెచ్చిన సార్థక శ్రమ సంపాదకులైన వేముల ప్రభాకర్‌ గారిది. ఈ పుణ్య కార్య ప్రకాశనానికి అండదండ లందించిన శ్రేయస్సు రామసింహకవి ముని మనుమడైన సర్దార్‌ గురుదేవ్‌ సింగ్‌ గారిది. ఈ ఉదాత్తమైన ఆత్మకథను చదివి ఆనందించే భాగ్యం పాఠకోత్తములది.
– ఘట్టమరాజు, 9964082076