– రాజ్యసభచైర్మెన్ లేఖ పై ఖర్గే ఆగ్రహం
న్యూఢిల్లీ : రాజ్యసభ చైర్మెన్ లేఖ నిరంకుశత్వాన్ని, దురహంకారాన్ని సమర్థిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధ్వజమెత్తారు. రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్‌కి రాసిన లేఖకు ఖర్గే సోమవారం ప్రత్యుత్తరమిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు, పార్లమెంట్ నిబంధనలను విధ్వంసం చేయడానికి, రాజ్యాంగం గొంతు నొక్కేందుకు అధికార పార్టీ ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ‘ఆయుధాన్ని’ అనువైన సాధనంగా ఎంచుకుందని మండిపడ్డారు. రాజ్యసభ చైర్మెన్ లేఖ పార్లమెంటు పట్ల మోడీ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని, దురహంకారాన్ని సమర్థిస్తోందని అన్నారు. ధన్కర్ లేవనెత్తిన పాయింట్లను ప్రస్తావిస్తూ.. తమ ఆందోళనను నిష్పాక్షికంగా మరియు తటస్థంగా పరిశీలించాలని కోరారు. ప్రత్యేకాధికార తీర్మానాలను కూడా ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు ఆయుధంగా వినియోగించిందని, ఇది పార్లమెంట్‌ను అణగదొక్కేందుకు పాలక వర్గం ఉద్దేశపూర్వకంగా రూపొందించిన విధానమని అన్నారు. మోడీ ప్రభుత్వం ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా 146 మంది ఎంపీల ఓటర్ల గొంతుకలను సమర్థవంతంగా మూయించిందని అన్నారు. సభకు సంరక్షకుడిగా, పార్లమెంటులో తమ ప్రభుత్వం జవాబుదారీగా ఉంచే ప్రజల హక్కును చైర్మెన్ కాపాడాలని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.