ఆటోడ్రైవర్లకు రూ.4,500 భృతి ఇవ్వాలి

ఆటోడ్రైవర్లకు రూ.4,500 భృతి ఇవ్వాలి– రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
– ప్రయివేటు ట్రాన్స్‌పోర్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్‌కు తెలంగాణ పబ్లిక్‌, ప్రయివేటు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహిళలకు ఉచిత బస్సుప్రయాణంతో తీవ్రంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.4500 భృతిని ఇవ్వాలని తెలంగాణ పబ్లిక్‌, ప్రయివేటు రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.అజరుబాబు డిమాండ్‌ చేశారు. రవాణా రంగంలోని కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ మేరకు వారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది కార్మికులు రవాణా రంగం మీద ఆధారపడి స్వయం ఉపాధి పొందుతున్నారనీ, వారిలో ఎక్కువ శాతం మంది చదువుకున్న యువకులు ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో లోన్ల ద్వారా వాహనాలు కొనుక్కుని ట్రాన్స్‌పోర్టు రంగంలోకి వస్తున్నారని తెలిపారు. వారిపై ట్రాఫిక్‌ పోలీస్‌, రవాణా శాఖ అధికారులు విపరీతమైన పెనాల్టీలు వేస్తున్నారని వాపోయారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. అదే సందర్భ:లో ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్‌, ప్రమాద బీమా రూ.5లక్షలు, ఆరోగ్యశ్రీద్వారా రూ.10 లక్షల ఉచిత వైద్యాన్ని వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. మూడు నెలల పాటు ఆటోల ఈఎంఐలపై మారటోరియం విధించాలని కోరారు. కేరళ తరహాలో రాష్ట్ర ప్రభుత్వమే ఆన్‌లైన్‌ యాప్‌ ఏర్పాటు చేసి తక్కువ కమిషన్‌తో కార్మికులకు ఉపయోగపడే విధంగా తీసుకురావాలని సూచించారు. ఎంవీ యాక్టు 2019 సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయొద్దనీ, కేంద్రం ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయాలని కోరారు.