అవనీశ్‌ సెంచరీ

– నాగాలాండ్‌పై హైదరాబాద్‌ గెలుపు
అహ్మదాబాద్‌ : దేశవాళీ 50 ఓవర్ల ఫార్మాట్‌ టోర్నమెంట్‌ విజరు హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ శుభారంభం చేసింది. గ్రూప్‌-సిలో నాగాలాండ్‌పై హైదరాబాద్‌ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. యువ ఆటగాడు అరవెల్లి అవనీశ్‌ (100, 82 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్‌ తిలక్‌ వర్మ (0) డకౌట్‌గా నిష్క్రమించినా.. ఓపెనర్‌ తన్మరు అగర్వాల్‌ (51, 54 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), వరుణ్‌ గౌడ్‌ (57, 78 బంతుల్లో) అర్థ సెంచరీలతో రాణించారు. నాగాలాండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 48.1 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో నాగాలాండ్‌ చేతులెత్తేసింది. 50 ఓవర్లలో 234/8 పరుగులే చేసింది. యుగంధర్‌ సింగ్‌ (80, 110 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), జగదీశ సుచిత్‌ (66, 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించటంతో నాగాలాండ్‌ ఆఖరు వరకు పోరాడింది. నాగాలాండ్‌పై 42 పరుగుల తేడాతో గెలుపొందిన హైదరాబాద్‌ విలువైన నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అరవెల్లి అవనీశ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. గ్రూప్‌-సిలో తర్వాతి మ్యాచ్‌లో సోమవారం ముంబయితో హైదరాబాద్‌ తలపడనుంది.