-సాంకేతిక సమస్యల వల్ల ప్రమాదాలు జరగొద్దు
– జిల్లా రోడ్డు సేఫ్టీ మీటింగ్ లో కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : జిల్లాలో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు తగ్గించడానికి అవలంబించాల్సిన విధానాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం నల్గొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధ్యక్షతన జిల్లా రోడ్డు సేఫ్టీ మీటింగ్ జరిగింది. రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలలో ప్రమాదాలు జరగకుండా నివారించడం కోసం పోలీసు, రోడ్లు భవనాలు, ఎక్సైజ్, ఆర్టీవో, ఆర్టీసీ తదితర శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా గుండా వెళ్లే జాతీయ రహదారులు 65, 167, 565, 365 లతోపాటు నార్కట్పల్లి నుండి అద్దంకి వెళ్లే రాష్ట్ర రహదారు లపై మొత్తం ప్రమాదాలు జరిగే ప్రాంతాలను 58 బ్లాక్ స్పాట్స్ గా పోలీసులు గుర్తించారు. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి 65 పై ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఆ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలపై సమావేశంలో చర్చించారు. జాతీయ రహదారి 65 పై చిట్యాల మండలం పెద్దకాపర్తి, చిట్యాల, నార్కెట్పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి, ముత్యాలమ్మ గూడెం, కట్టంగూరు, ఇనుపాముల, టేకుమట్ల ప్రాంతాల్లో, జాతీయ రహదారి 167 పై కొండ భీమనపల్లి, మీనాక్షి హోటల్, అంగడిపేట ఎక్స్ రోడ్, పెద్దవూర వై జంక్షన్, ఇబ్రహీంపేట, నిడమనూరు పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో… రాష్ట్ర రహదారి 2 ఎన్ఏఎం పై ఎల్లారెడ్డిగూడెం, చర్లపల్లి , పానగల్ ఫ్లైఓవర్, నందిపాడు, ఈదులగూడెం ప్రాంతాల్లో ప్రమాదాలు జరగడానికి గల కారణాలని రోడ్డు సేఫ్టీ అధికారి రిటైర్డ్ ఎస్సై అంజయ్య కలెక్టర్ ఎస్పీలకు తెలిపారు. ఈ సందర్భంగా మొదట అధికంగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల వద్ద పోలీసులు, ఆర్ అండ్ బి అధికారులు వెళ్లి తనిఖీ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. అనంతరం వారం రోజుల్లో మళ్లీ ఒకసారి సమావేశం నిర్వహించి ప్రమాదాలు నివారించడానికి అన్ని శాఖల సమన్వయంతో రహదారుల వారిగా సమీక్ష చేస్తామన్నారు. ఎన్ఐసి వాళ్ళు ఐఆర్ఏడి అనే సాఫ్ట్వేర్ ని రోడ్డు ప్రమాదాల కోసం రూపొందించారని ఈ సాఫ్ట్వేర్ ను అన్ని శాఖల అధికారులు ఉపయోగించి సమన్వయంతో రెస్పాండ్ కావాలని కలెక్టర్ సూచించారు. జాతీయ రహదారి 565 పై దేవరకొండ రోడ్ లో ఉన్న సెయింట్ ఆల్ఫోన్స్ పాఠశాల వద్ద లిఫ్ట్ ఎస్కలేటర్ తో కూడిన ఫుటోవర్ బ్రిడ్జ్ ను రోడ్డు సేఫ్టీ కమిటీ ఆమోదించి రాష్ట్రానికి పంపిస్తామని, బ్లాక్ స్పాట్స్ పై తనిఖీలు నిర్వహించి రోడ్డు ప్రమాదాల కారణాలు తెలిపాలని అధికారులను ఆదేశించారు.సాంకేతిక సమస్య వల్ల ఒక ప్రమాదం కూడా జరగవద్దని, అని శాఖలు సమన్వయతో పనిచేసి ప్రాణాలను నిలబెట్టాలని కోరారు. ఎస్పి శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ వేగాన్ని తగ్గించే నివారణ చర్యలు ఏమైనా ఉంటే వాటిని అభివృద్ధి చేయాలని, వేగాన్ని తగ్గించడానికి బారికేట్స్ తో పాటు, డంబుల్ స్ట్రిప్స్ పెట్టాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా పోలీస్ శాఖ ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అన్ని శాఖలు కలిసి ఒక్క ప్రాణం కూడా పోకుంట చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఈఈ యాకూబ్, జాతీయ రహదారుల ఈఈ రాజేందర్, డిఈ రాజశేఖర్, డిఈ గణేష్, ఏఈ మహమూద్, ఎక్సైజ్ సూపరిండెంట్ సంతోష్, ఆర్టీవో లావణ్య, ఆర్టీసీ అధికారులు, రోడ్ సేఫ్టీ అధికారి రిటైర్డ్ ఎస్సై అంజయ్య, ఐ ఆర్ డి ఏ డేటా కలెక్షన్ అధికారులు పాల్గొన్నారు.