క్రీడలతో చెడు వ్యసనాలు దూరం..

Get rid of bad addictions with sports.– చిన్న పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదు..
– 26 నుండి 4 పధకాలు అమలు..
– ఎమ్మెల్యే జారే…
నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామీణ ప్రాంత యువత చెడు వ్యసనాలు,మత్తు పదార్థాలు మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలంటే ఏదో ఒక స్థానిక ఆటలు అలవర్చుకోవాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. మండల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన ముందుగా కొత్త కావడి గుండ్ల లో స్థానిక యువకుల ఆధ్వర్యంలో నిర్వహించే వాలీబాల్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి క్రీడాకారులు పరిచయం అనంతరం మాట్లాడుతూ క్రీడల తో శారీరక మానసిక ఉల్లాసం తో పాటు ఉత్తమ ప్రతిభ కనబరిచే వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. పిల్లలు చెడు మార్గాల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షిస్తూ,చక్కగా చదువుకునేలా ప్రోత్సహించాలన్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండని మైనర్ లకు మోటార్ సైకిళ్ళు ఇచ్చే ముందు తల్లిదండ్రులు ఆలోచన చేయాలన్నారు.రోడ్డు ప్రమాదం సంభవిస్తే అనుకోని అనర్దాలు జరుగుతాయని జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా క్రీడలను ప్రారంభించి కొంచెం సేపు ఆటాడి క్రీడా స్ఫూర్తిని చాటారు. ఈ నెల 26 నుంచి ప్రభుత్వం అందించే ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఆహారభద్రత కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పధకాలు ప్రజలకు వివరిస్తూ ఆయన మండలంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించిన,నూతన పనులకు శంకుస్థాపనలు చేసారు.
రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాలు ప్రారంభించారు. రూ.10 లక్షల వ్యయంతో నిర్మించబోయే బ్రిడ్జి, మరో రూ.5 లక్షల తో నిర్మించే కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేసారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. పర్యటనలో భాగంగా పలు గ్రామాలను సందర్శించి ఇందిరమ్మ ఇంటింటి సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ నెల 26 నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం,భూమిలేని కుటుంబాలకు సంవత్సరానికి రూ. 12 వేలు,రైతు భరోసా పథకం లో వ్యవసాయ భూములకు పెట్టుబడి సహాయం కింద ఎకరానికి సంవత్సరానికి రూ. 12 వేలు,ఆహారభద్రత కార్డులు అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ నూతనంగా రేషన్ కార్డుల మంజూరు చేస్తామని అన్నారు.ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికీ రాబోయే 4 సంవత్సరాలలో విడతల వారీగా ఇండ్ల నిర్మాణం ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలతో పక్కా ఇళ్లు ఇచ్చే పథకాలు ప్రజలకు అందిస్తున్న తరుణంలో నాయకులు,కార్యకర్తలు, పార్టీ అభిమానులు ప్రజల మధ్యన ఉంటూ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న పథకాలను వివరించాలన్నారు. కోయ రంగాపురం లో రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించబోయే బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అనంతారం లో 5 లక్షలతో నిర్మించే కల్వర్ట్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వేదాంతపురం,కేశప్పగూడెం గుర్రాల చెరువు మూడు గ్రామ పంచాయతీలకు గ్రామీణ ఉపాధి పధకం నిధులు రూ. 60 లక్షల తో నిర్మించిన నూతన పంచాయతీ భవనాలను ప్రారంభోత్సవం చేశారు. మండలంలో అనారోగ్యంతో ఇబ్బంది పడేవారికి ఇటీవల మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు,మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్,ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్,గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఏఈ బీఎస్వీ ప్రసాద్,కాంగ్రెస్ మండల అద్యక్షుడు తుమ్మ రాంబాబు,నాయకులు సుంకవల్లి వీరభద్రరావు,జూపల్లి రమేష్,నండ్రు రమేష్,జూపల్లి ప్రమోద్ లు పాల్గొన్నారు.