డిజిట‌ల్ వ్య‌స‌నానికి దూరంగా..

Away from digital addiction..ప్రస్తుత కాలంలో మన జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాటిలో ముఖ్యమైనది టెక్నాలజీ వినియోగం. స్మార్ట్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాలు మన రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారాయి. అయితే, ఈ టెక్నాలజీ ప్రేరిత ప్రపంచంలో అనేక వ్యసనాలు మనల్ని పట్టిపీడిస్తున్నాయి. వాటిలో ఒకటి డూమ్‌ స్క్రోలింగ్‌. ఇది ఒక మహమ్మారి, మన ఆరోగ్యానికి హానికరంగా పరిణమిస్తోంది. దాని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం...
డూమ్‌ స్క్రోలింగ్‌ అంటే సామాజిక మాధ్యమాలు, న్యూస్‌ వెబ్‌సైట్లు, ప్రతికూల, భయానక వార్తలను ఎడతెగకుండా చూస్తూ, స్క్రోల్‌ చేస్తూ ఎక్కువ సమయం గడపడం. ఇది వ్యక్తుల ఆలోచనలు, భావోద్వేగాలపై ప్రతికూలంగా పనిచేస్తుంది. ముఖ్యంగా అనిశ్చితి, భయాలు, ఆందోళనలు పెరిగే పరిస్థితుల్లో మనలో బలమైన జిజ్ఞాస వల్ల ఇలాంటి కంటెంట్‌పై మరింత ఆసక్తి చూపిస్తాం. ఇది మానసికంగా క్షీణతకు దారితీస్తుంది.
పుట్టుకకు కారణాలు
డూమ్‌ స్క్రోలింగ్‌ పుట్టుకకు ప్రధాన కారణాలు టెక్నాలజీ పరిణామం, సమాచార యుగం, సామాజిక మాధ్యమాల అతి వినియోగం. ప్రతి నిమిషం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే తాజా వార్తలను మనం తెలుసుకోవాలనే ఆసక్తి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో డూమ్‌ స్క్రోలింగ్‌ పెరిగిపోయింది. ప్రతికూల వార్తలు, మరణాలు, ఆర్థిక కష్టాలు వంటి అంశాలు వ్యక్తుల్లో ఆందోళనను పెంచాయి.
కలిగే ప్రభావాలు దీని వల్ల మన ఆరోగ్యంపై పడే ప్రభావాలను ప్రధానంగా మూడు విభాగాలుగా విభజించవచ్చు:
1.మానసిక ఆరోగ్యం: డూమ్‌ స్క్రోలింగ్‌ వల్ల మానసిక ఆరోగ్యం అత్యంత ప్రభావితమవుతుంది. ఆందోళన, డిప్రెషన్‌: నిరంతరం ప్రతికూల వార్తలను చదవడం వల్ల వ్యక్తుల్లో భవిష్యత్తుపై భయం పెరుగుతుంది. అది మానసిక ఆందోళనకు, డిప్రెషన్‌కు దారితీస్తుంది. దాంతో జీవితంపై నమ్మకం కోల్పోతారు. నిద్రలేమి: సమయానికి నిద్రపోకుండా రాత్రి వేళల్లో కూడా స్మార్ట్‌ఫోన్‌ స్క్రోల్‌ చేయడం నిద్రలేమికి కారణం అవుతుంది. నిద్రలేమి వల్ల మనశ్శక్తి తగ్గిపోతుంది. అది మానసిక ఆందోళనను మరింతగా పెంచుతుంది. ఆత్మహత్యను ప్రేరేపించే ఆలోచనలు: మానసిక ఒత్తిడికి గురైన వారు తాము ఏం చేస్తున్నారో తెలియకుండా జీవితం నిరుత్సాహంగా ఉందనే భావన, దాని వల్ల కలిగే ఆలోచనలు ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తాయి. ఇది సుదీర్ఘ కాలంలో తీవ్రమైన మానసిక సమస్యలకు దారితీస్తుంది.
2. శారీరక ఆరోగ్యం : డూమ్‌ స్క్రోలింగ్‌ వల్ల శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి. స్క్రీన్‌ సమయ పెరుగుదల: స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు ముందే ఎక్కువ సమయం గడపడం వల్ల కంటి సమస్యలు వస్తాయి. ప్రత్యేకంగా డిజిటల్‌ ఐ స్ట్రెన్‌ అనే సమస్య ఉత్పన్నమవుతుంది. కంటిలో తడి పదార్థం తగ్గి కంటినొప్పి, మసక కంటిచూపు వంటి సమస్యలు వస్తాయి. శరీర తిమ్మిరి: డూమ్‌ స్క్రోలింగ్‌ వల్ల కదలికలు తగ్గి శరీర తిమ్మిరి లేదా బరువు పెరగడం సాధారణం. ఇది మధుమేహం,
గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది.
వీపు, మెడ నొప్పులు: అనుకూలమైన పొజిషన్‌లో కాకుండా ఫోన్‌ స్క్రోల్‌ చేయడం వల్ల టెక్‌ నెక్‌ అనే సమస్య ఉత్పన్నమవుతుంది.
3. భావోద్వేగ ఆరోగ్యం : డూమ్‌ స్క్రోలింగ్‌ భావోద్వేగ స్థిరత్వాన్ని కూడా దెబ్బతీస్తుంది.
భయాలు, ఒత్తిడి: భయంకర వార్తలను చదవడం వల్ల వ్యక్తి భావోద్వేగంగా చాలా బలహీనతను అనుభవిస్తాడు. ఇది
కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంబంధాలను దెబ్బతీస్తుంది.
డూమ్‌ స్క్రోలింగ్‌, డోపమైన్‌ వ్యసన చక్రం
డూమ్‌ స్క్రోలింగ్‌ సమయంలో మన మెదడులో డోపమైన్‌ అనే రసాయన పదార్థం విడుదల అవుతుంది. డోపమైన్‌ అనేది ఆనందానికి, సంతృప్తికి, ప్రేరణకు కారణమయ్యే న్యూరోట్రాన్స్‌మిటర్‌. ప్రతిసారి కొత్త వార్తను చూడగానే, ప్రత్యేకించి సంచలనాత్మక, భయానక, ఆసక్తికరమైన సమాచారం ఉంటే మెదడు చిన్న మొత్తంలో డోపమైన్‌ను విడుదల చేస్తుంది. ఇది తక్షణంగా మనలో తాత్కాలిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అయితే ఈ అనుభూతిని మళ్ళీ పొందడానికి మనం ఆ కంటెంట్‌ను మరింతగా స్క్రోల్‌ చేయడం ప్రారంభిస్తాము. ఇది డోపమైన్‌ లూప్‌ అని పిలువబడే వ్యసన చక్రానికి దారితీస్తుంది. ఈ విధంగా మనం ఎన్ని వార్తలు చూసినా సరిపోదు. మరిన్ని చూసేందుకు ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. ఇది అనారోగ్యకరమైన అలవాటుగా మారి ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది
అసహనం
సామాజిక మాధ్యమాల్లో ఎడతెగని వార్తల ప్రవాహం మనలో ఒక నిరాసక్తత, అసహనం పెరగడానికి కారణం అవుతుంది. ఇది ఇతరులతో మన దినచర్యల్లో అసౌకర్యం కలిగిస్తుంది.
డూమ్‌ స్క్రోలింగ్‌ను తగ్గించే మార్గాలు
దీన్ని నియంత్రించడం అంత సులభం కాదు. కానీ కొంత క్రమశిక్షణ, జాగ్రత్తతో మాత్రం సాధ్యమే.
1. సమయ పరిమితి: సోషల్‌ మీడియా కోసం ప్రతిరోజూ ఒక సమయం కేటాయించండి. ఆ పరిమితి దాటకూడదని కఠినంగా నిర్ణయించుకోండి.
2. సానుకుల కంటెంట్‌ను ఎంచుకోండి: ప్రతికూల వార్తలను, పక్కనబెట్టి సానుకుల వార్తలు, వ్యక్తిత్వ వికాస ఆర్టికల్స్‌, విద్యాపరమైన కంటెంట్‌ను చదవడం అలవాటు చేసుకోండి.
3. డిజిటల్‌ డీటాక్స్‌: ప్రతిరోజూ కొంత సమయం పూర్తి డిజిటల్‌ విరామం తీసుకోండి. ఫోన్‌, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండడం ద్వారా మనసుకు విశ్రాంతి కలిగించండి.
4. వ్యాయామం: ధ్యానం, యోగా, ఇతర శారీరక వ్యాయామాలు మనసును ప్రశాంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించి, శారీరకంగా శ్రేయోభివృద్ధిని కలిగిస్తాయి.
5. గాడ్జెట్‌ల వినియోగం తగ్గించండి: నిద్రకు ఒక గంట ముందు స్క్రీన్‌లను పూర్తిగా ఆఫ్‌ చేయడం అవసరం. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
సమాజిక బాధ్యతగా…
ప్రజల్లో డూమ్‌ స్క్రోలింగ్‌ మానసిక, శారీరక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు చూపుతుందో తెలియజేయడం చాలా ముఖ్యం. ఈ సమస్యను నివారించడానికి వైద్యులు, విద్యావేత్తలు, నిపుణులు కలిసి పని చేయాలి. పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాల్లో డిజిటల్‌ డిటాక్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించవచ్చు. డూమ్‌ స్క్రోలింగ్‌ అనేది ఒక ప్రమాదకర వ్యసనంగా ఉన్నప్పటికీ, దీనిని సమర్థవంతంగా నియంత్రించడం ద్వారా మన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. వ్యక్తిగత స్థాయిలో స్పృహను పెంచుకొని, మార్గదర్శకాల ప్రకారం క్రమశిక్షణతో ముందుకు సాగితే, ఈ వ్యసనాన్ని తగ్గించుకోవచ్చు. ‘మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం సంతోషకరంగా ఉంటుంది’ అందుకే ప్రతికూలతను పక్కనబెట్టి సానుకూలతను ఆలింగనం చేసుకోవడం మానసిక ఆరోగ్యానికి మంచిదని గుర్తించాలి. మీ ఆరోగ్యాన్ని రక్షించేందుకు చడూమ్‌ స్క్రోలింగ్‌ను నియంత్రించండి!
Dr.Prathusha. Nerella
MD(General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician
Positive Psychologist certified Nutritionist
Diabetes And Lifestyle Expert
Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach.
Ph: 8897684912/040-49950314