రోడ్డు ప్రమాదాలు నివారించాలి

Avoid road accidents– అప్ప నుంచి మన్నెగూడ విస్తరణ పనులు చేపట్టాలి
– హైదరాబాద్‌-బీజాపూర్‌ అంతర్రాష్ట్ర రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా
– భారీగా స్తంభించిన ట్రాఫిక్‌
– ఆర్డీఓ జోక్యంతో ఆందోళన విరమణ
నవతెలంగాణ-చేవెళ్ల
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఆలూరు స్టేజీ వద్ద వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చిరు వ్యాపారుల మీదికి దూసుకెళ్లిన ఘటన తెలిసిందే. దాంతో ఆ ప్రాంత గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అప్ప జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణ పనులను వెంటనే చేపట్టి రోడ్డు ప్రమాదాలను నివారించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో హైదరాబాద్‌-బీజాపూర్‌ అంతర్రాష్ట్ర రహదారిపై చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌ రత్నం, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు పట్లోళ్ల కార్తీక్‌ రెడ్డి, దేశమొల్ల ఆంజనేయులు, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు కె.రామస్వామి, ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళన నిర్వహించారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైటాయించారు. ఈ సందర్భంగా ‘నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ డౌన్‌ డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. హైవే నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు మంజూరైనప్పటికీ నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యానికి జవాబు కావాలంటూ ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. అంతకు మందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు ఇరుకుగా ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. సోమవారం జరిగిన ప్రమాదంలో పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగిందని, గతంలోనూ పలువురు మృతిచెందారని అన్నారు. వెంటనే రోడ్డు పనులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని కోరారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్‌ ఆందోళనకారులతో మాట్లాడారు..
ఆర్డీఓ మాట్లాడుతూ.. పనుల జాప్యతకు ప్రధాన కారణం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ 2021లో సామాజికవేత్త తేజపు బాలాంతరం వేసిన కేసే కారణమన్నారు. తెలంగాణ పోలీస్‌ అకాడమీ-మన్నెగూడ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దాదాపు 900 మర్రిచెట్లు తొలగించడం వల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని వేసిన పిటిషన్‌ విచారణ అనంతరం ఫైనల్‌ తీర్పు రానున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ డిపార్ట్‌మెంట్‌, నేషనల్‌ హైవే డిపార్ట్‌మెంట్‌ కౌంటర్‌ వేయగా.. సామాజికవేత్త తేజపు బాలాంతరం వేసిన కేసు కొట్టివేస్తూ దేశంలోని పర్యావరణ శాఖ అనుమతితో రోడ్డు నిర్మించుకోవచ్చునని తీర్పునిచ్చిందన్నారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ, నేషనల్‌ హైవే పర్యావరణ శాఖ డిసెంబర్‌లో అనుమతి కోరినట్టు తెలిపారు. అందుకు పర్యావరణ శాఖ ఫిబ్రవరిలో అనుమతించగా.. సామాజికవేత్త తేజపు బాలాంతరం తిరిగి జనవరిలో ఓయూ నెంబర్‌ 262/2024 కేసు ఫైల్‌ చేసి స్టే తీసుకున్నారని తెలిపారు.
ఈ కేసు తిరిగి ఈనెల 16న ఫైనల్‌ హియర్‌కు రానున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేషనల్‌ హైవే డీడీ, తను చెన్నై వెళుతున్నామన్నారు. తనతోపాటు అఖిలపక్ష సభ్యులు చెన్నైలోని గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు రావాలని కోరారు. ఇక్కడి సమస్య, ప్రమాదాల విషయాన్ని ట్రిబునల్‌ దృష్టికి తీసుకెళ్దామని తెలిపారు. ఆర్డీఓ హామీతో అఖిలపక్ష నాయకులు ధర్నా విరమించారు. అలాగే లారీ ప్రమాద బాధిత కుటంబాలను ఆదుకోవాలని ఆర్డీఓను అఖిలపక్ష నాయకులు కోరగా.. రోడ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టు నుంచి రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఆర్డీఓ బదులిచ్చారు. కాగా, ధర్నాతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కాగా.. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్ళించారు. ధర్నా అనంతరం యధావిధిగా వాహనాల రాకపోకలు సాగాయి.