నాపై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి

నవతెలంగాణ-గుండాల
దళిత బంధు, కల్యాణలక్ష్మీ, సీఎం రిలీఫ్‌ ఫండ్‌,పెన్షన్ల మంజూరు విషయంలో తాను డబ్బులు తీసుకున్నానని కొందరు చేస్తున్న అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బొంగు శ్రీశైలం యాదవ్‌ అన్నారు. బుధవారం అనంతారం గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళిత బంధు విషయంలో లబ్ధిదారుల నుండి తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపించాలని,అసలు అనంతారం గ్రామంలో ఇప్పటివరకు దళిత బంధు లబ్ధిదారులను ఎంపికనే చేయలేదని,తాను ఎక్కడ తప్పు చేయలేదన్నారు.నాపై చేస్తున్న ఆరోపణలకు దళిత కాలనీలోనే తాను బహిరంగ చర్చకు తాను సిద్ధమని మీరు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.బహిరంగ చర్చలో తాను తప్పులు చేసినట్లు నిరూపిస్తే ఎంపీటీసీ పదవికి రాజీనామాతో పాటు,గ్రామ బహిష్కరణకి కూడా తాను సిద్ధమన్నారు.నేను రాజకీయంగా గత ఐదు సంవత్సరాలు గ్రామ సర్పంచ్‌ గా,ప్రస్తుత ఎంపీటీసీ పదవీకాలంలో ఒక్క రూపాయి కూడా ప్రజల నుండి ఆశించలేదని,ప్రజా సేవ చేస్తున్నానని,తన కష్టంతోనే ఈ స్థాయికి చేరానని అన్నారు.కొందరు నాకు గిట్టని వారు రాజకీయ కక్షతో నాపై తప్పుడు ప్రచారం చేసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని,నావిషయంలో మా గ్రామ దళిత సోదరులను కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.ప్రభుత్వ విప్‌,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి ఆదేశాల ప్రకారం అర్హులైన లబ్ధిదారులను దళిత బంధుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.ఇకనైనా తనపై చేస్తున్న అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని,తన జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.ఈకార్యక్రమంలో కుమ్మరికుంట్ల రవి,చెరిపల్లి సిద్ధులు,మబ్బు రామాంజి,అనురాధ చెరిపల్లి యాదమ్మ,చుక్క శోభ,పెండ్యాల సునీత తదితరులు పాల్గొన్నారు