– ప్రగల్భాలొద్దు..చర్చకు రండి
– కాళేశ్వరం, గోదావరి జలాలపై వాస్తవాలు తేలాలి
– మాజీ సీఎం స్థాయిలో ఎలాంటి భాషను వాడుతున్నారు?
– చచ్చిన పామును మేమెందుకు చంపుతాం : కేసీఆర్‌నుద్దేశించి అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టులపైనా, గోదావరి నదీ జలాలపైనా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ, బీఆర్‌ఎస్‌ఎల్పీ నేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రగల్భాలు మాని సభలో చర్చకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా గురువారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల, పంపు హౌజ్‌ల విషయంలో చాలా విషయాలపైనా వాస్తవాల ప్రాతిపదిక చర్చ జరిగేలా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణ సమాజం, రైతులు, ప్రజల పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం తమ ఆహ్వానాన్ని మన్నించి మేడిగడ్డకు వస్తే బాగుండేదన్నారు. సభ్యులమంతా ప్రాజెక్టులను పరిశీలించి అక్కడ జరిగిన నష్టాన్ని, రైతులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపే అవకాశాన్ని బీఆర్‌ఎస్ వదులుకున్నదన్నారు. మేడిగడ్డకు రాకపోనూ కొత్తగా వచ్చిన తమ ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నదని విమర్శించారు. ‘మాజీ ముఖ్యమంత్రి హోదా లో కేసీఆర్ నల్లగొండలో మాట్లాడిన భాషపై సభలో చర్చిద్దామా అధ్యక్షా?.. ‘ఏం పీకపోయారు’ అంటారా అధ్యక్షా?. మాజీ సీఎంగా పదేండ్లు, కేంద్రంమంత్రిగా, రాష్ట్రమంత్రిగా పనిచేశాననీ, ఉద్యమనేతనని గొప్పలు చెప్పుకుని జబ్బలు చరచుకునే కేసీఆర్.. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి ఏం పీకపోయారు అని అంటారా? ఇప్పటికే ప్రజలు ఆయన పాయింట్ పీకేశారు. అట్లనే మాట్లాడితే ఉన్న అంగి, లాగును కూడా పీకుతం. తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో పాయింట్ ఊడపీకారు. అది తట్టుకోలేక బొక్కబోర్లపడితే బొక్కలు ఇరిగినయి. ముఖ్యమంత్రిని పట్టుకుని ఏంపీకపోయారు అని అడుగుతారా? నాలుగు కోట్ల మంది ఓట్లేసి గెలిపించిన సీఎం అలా అనటమే సాంప్రదాయమా? మేడిగడ్డ మేడిపండులా కుంగిపోతే మేడిగడ్డలో నీళ్లు నింపడానికి అవకాశం ఉంటదా? గతంలో హరీశ్‌రావు, కేసీఆర్ సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేశారు కదా? ఇప్పుడు వారికే పెత్తనం ఇస్తాం. వాళ్లనే చేయమనండి. అక్కడ నీళ్లు ఎలా నింపుతారో? మేడిగడ్డ నుంచి అన్నారంలో ఏవిధంగా ఎత్తిపోస్తరో? అన్నారం నుంచి సుందిళ్లలో ఏవిధంగా ఎత్తిపోస్తోరో? బాధ్యతను వాళ్లను తీసుకోమనండి. కుంగిపోయి కుప్పకూలిపోయే పరిస్థితి ఉంటే నీళ్లు నింపడానికి ఏమాత్రం అవకాశం లేదు. 94 వేల కోట్ల రూపాయలు వృథాఅయిపోయి, ప్రాజెక్టుకు అక్కరకు రాకుండా పోయింది’ అని సీఎం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చకు రావాలని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతను అడిగితే పారిపోయి ఫామ్‌హౌజ్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. కాళేశర్వంలో జరిగిన అవినీతి బయటపడుతుందనే కారణంతోనే భయపడి సభకు రావడం లేదని విమర్శించారు. కేసీఆర్‌ను తాము చంపుతామంటూ ప్రచారం చేస్తున్నారనీ, చచ్చిన పామును ఎవరైనా చంపుతారా? అని ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికలలో ఆ పామును ప్రజలు చేతితో కాకుండా కట్టెతో కొట్టి చంపారని అన్నారు. దాన్ని తట్టుకోలేక సానుభూతి కోసం వీల్‌చైర్, వీధి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. నిజాయితీ ఉంటే మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై చర్చకు రావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కాళేశ్వరం మీదనే ప్రత్యేక చర్చ అంటారా? సమయం ఇవ్వండి’ అని స్పీకర్‌ను కోరారు.