– ది ఈ-ఐసీయూ ప్రాజెక్టు సేవలకు గుర్తింపు
నవతెలంగాణ- సిటీబ్యూరో
హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రి అందిస్తున్న సేవలకు గుర్తింపు దక్కింది. ది ఈ-ఐసీయూ ప్రాజెక్టులో అందిస్తున్న సేవలకు కాన్ఫిరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ (సీఐఐ) ఢిల్లీ – 2023 అవార్డును ప్రదానం చేసింది. నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప ఆస్పత్రిలోని ఆయన క్యాబిన్‌లో ఈ అవార్డును గురువారం అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం, నేషనల్ హెల్త్ మిషన్ సహకారంతో కొన్నేండ్లుగా ది ఈ-ఐసీయూ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వైద్యులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వకపోయినా ఈ ప్రాజెక్టు సాయంతో అత్యవసర సమయంలో రోగుల ప్రాణాన్ని కాపాడేలా చొరవ తీసుకున్నారు. 2021లో పైలెట్ ప్రాజెక్టు కింద సిరిసిల్లలో తొలి కేంద్రం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది కేంద్రాలను జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదం, పాము కాటుకు గురికావడం లాంటి అత్యవసర సమయాల్లో ఆ కేంద్రాలకు వచ్చిన రోగులకు ఎలాంటి వైద్యం అందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను నిమ్స్ నుంచి వైద్య బృందం ఆయా కేంద్రాల్లో ఉన్న వారికి వర్చువల్ పద్ధతిలో వివరిస్తుంది. దీంతో ఎంతో మంది ప్రాణాలు దక్కాయి. మూడేండ్ల వ్యవధిలో 7000మంది అత్యవసర రోగులకు సేవలందించారు. కేంద్రంలో ఉన్న వైద్యులను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తూ నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నందుకు సీఐఐ గుర్తించి 2023 సంవత్సరానికిగాను హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ టెక్నాలజీ అవార్డు -2023ను ఫస్ట్ రన్నర్‌ప్‌గా అందజేసింది. ఈ అవార్డు రావడం పట్ల వైద్యులకు నిమ్స్ డైరెక్టర్ అభినందనలు తెలిపారు. ది ఈ-ఐసీయూ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ పద్మజను ప్రత్యేకంగా అభినందించారు.