పెద్దకొడుకు బంటిగాడు ఒక భుజంపైకి, ఇంకో భుజం కిందికి పెట్టుకుని ఇంట్లోంచి బయ టకు వెళ్తున్నాడు. వాడిని అలా చూసేసరికి తల్లి వాణికి ఆందోళన కలిగింది.
‘ఏమిట్రా బంటీ భుజానికి ఏమైందీ?’ అన్నది వాణి ఆందోళనగా అడిగింది. బంటిగాడు సమాధానం ఇవ్వలేదు. పైగా గడ్డం కింద చేయి వేసి రుద్దుకుంటూ బయటకి వెళ్లిపోయాడు.
వాణికి ఆందోళన ఎక్కువైంది. హడావుడిగా ఇంట్లోకి వెళ్లింది. టీవీలో ఏదో అవార్డుల గురించి కార్యక్రమం చూస్తూ గట్టిగా చప్పట్లు కొడుతున్నాడు శేఖర్.
‘ఏమండి బంటిగాడికి ఏమో అయ్యింది’ అన్నది వాణి ఆదుర్దాగా ‘ఏమైంది?’ అన్నాడు శేఖర్ టీవీలో నుంచి పక్కకు చూడకుండానే.
‘మీకు ఎప్పుడూ టీవీ గొడవేనా? ఇంట్లో పిల్లలు ఏమయ్యారో పట్టదా? బంటిగాడేమో భుజంపైకి పెట్టి నడుస్తున్నాడు. చింటుగాడు పొద్దున్నే వెళ్లాడు. ఎక్కడున్నాడో తెలియదు. పొద్దున టిఫిన్ ఏమి తిన్నాడో, ఎక్కడ ఆడుతున్నాడో తెలియదు!’ అంటూ రిమోట్ లాక్కునే ప్రయత్నం చేసింది వాణి. ఈ క్రమంలో టీవీపై ఆమె దృష్టి పడింది! అందులో అల్లు అర్జున్ లాగే బంటిగాడు ప్రవరిస్తున్న విషయమూ అర్థమైంది! చేతిలో రిమోట్ వదిలేసింది!
‘చూశావా మన తెలుగు నటుడికి మొట్టమొదటిసారి ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది!’ అంటూ శేఖర్ కూడా గడ్డం కింద చెయ్యివేసి రుద్దాడు శేఖర్.
వాణి నిస్సత్తువగా సోఫాలో కూలబడింది. భర్త చెప్పిన రెండు విషయాలు ఆమెకి షాక్‌నిచ్చాయి. ఒక దొంగ స్మగ్లర్ పాత్రకు ఉత్తమ నటుడి అవార్డు! రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన సినిమాకు జాతీయ సమైక్యతా అవార్డు?’ ఏమిటీ దుస్థితి అనుకుంటున్నది వాణి.
‘నీవు బాధపడ్డా సరే! అవార్డులు సరిగ్గానే ఇచ్చారు. విశ్వగురు పాలనంటే ఏమిటనుకున్నావు! తగ్గేదేలే’ అన్నాడు శేఖర్.
‘తగ్గు!తగ్గు! లేదంటే చాలా బాధపడాల్సి వస్తుంది’! అంటూ వచ్చాడు కిరణ్. ఆయనతో పాటు బంటీ, చింటూ కూడా వచ్చారు.
‘రా బావా!’ అంటూ కిరణ్‌ని అప్యాయంగా పిలిచాడు శేఖర్.
‘వీళ్లెక్కడ దొరికారు అన్నా’ అడిగింది వాణి.
‘నీ చిన్నకొడుకు మసీదు వద్ద. పెద్దకొడుకు పోలీస్‌స్టేషన్‌లో దొరికారు’! అన్నాడు కిరణ్.
భార్యభర్తలు కంగారు పడ్డారు.
‘వీళ్లెందుకు అక్కడికి వెళ్లారు?’ అడిగారు ఏక కంఠంతో.
‘నీ చిన్నకొడుకు మసీదు వద్దకు వెళ్లి మీరంతా ఇక్కడెందుకు ఉన్నారు పాకిస్తాన్‌కి పోండి లేదంటే చంపేస్తాను. అని బెదిరిస్తున్నాడు. వాడి క్లోజ్ ఫ్రెండ్ ఎదురొచ్చి మనిద్దరం క్లోజ్‌ఫ్రెండ్స్ కదరా! నన్ను కూడా చంపుతావా? అని అడిగితే ముందు నిన్నే చంపుతా అంటూ గొంతు పట్టుకున్నాడు. ఆరేళ్ల పిల్లవాడు చంపుతా అంటుంటే అందరూ కంగారుపడ్డారు. అటుగా వెళ్తునన్న నన్ను గుర్తుపట్టి మీ మేనల్లుడిని తీసుకెళ్లండి.అంటూ నాకు అప్పగించారు’ అన్నాడు కిరణ్.
వాణి కోపంగా భర్తను చూసింది. శేఖర్ తల దించుకున్నాడు. రాత్రి బలవంతంగా నిద్రపోతున్న చింటుగాడిని లేపి మరీ ‘కాశ్మీర్‌ఫైల్స్’ సినిమా చూపాడు. దాని ప్రభావం ఇంతలా ఉంటుందని ఊహించలేదు.
‘వీడు పోలీస్‌స్టేషన్‌లో ఎందుకున్నాడు?’ అడిగింది వాణి.
బంటిగాడిని పోలీసులు పట్టుకునిపోయి స్టేషన్‌లో ఉంచారు. వాడు ఎక్కడినుంచో గొడ్డలి తెచ్చుకుని చెట్టు మీదకి ఎక్కి ఒక కొమ్మని నరుకుతుంటే, ఆ చెట్టు ఓనరు పోలీసులకు ఫోన్ చేశాడంట. పోలీసులు వచ్చి ఎందుకు చెట్టు కొట్టావంటే మంగళం శీనుకి అమ్ముతానంటూ గడ్డం కింద చేయివేసి రుద్దుకున్నాడంట! నీ మేనల్లుడు గంధం చెట్లు స్మగ్లింగ్ చేస్తున్నాడు రమ్మంటూ, ఆస్టేషన్ సీఐ నాకు ఫోన్ చేశాడు. అతడు నా ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది! లేకపోతే వీడు బాల నేరస్తుడయ్యేవాడు’ అన్నాడు కిరణ్.
‘తగ్గేదేలే’ అన్నాడు బంటిగాడు.
వాణికి కోపం నశాళానికంటింది! ‘అక్కడే వదిలేసి రావాల్సింది. వెదవకి బడితె పూజ జరిగేది’ అంటూ బంటిని కొట్టబోయింది.
‘ఆగు వాణి! దెబ్బలు పడాల్సింది పసిపిల్లలు కాదు’!అంటూ బావగారి మొహంలోకి చూశాడు కిరణ్.
అప్పటికే శేఖర్ ముఖం వాడిపోయింది.
‘అవార్డులు, బహుమతులు గొప్పవాటికి ఇవ్వాలి. ఉత్తమ నటుడి అవార్డు గొప్ప మానవతా విలువలు చెప్పి ఆచరించే పాత్రకి ఇవ్వాలి. చట్టాన్ని ఎట్లా ఏ మార్చవచ్చో నేర్పే పాత్రకి కాదు! గొప్ప నటన ఉండవచ్చు. కాని అది దుష్ప్రభావాన్ని కలిగిస్తే దాని వల్ల ఇలాంటి ఫలితాలు వస్తాయి’ అన్నాడు కిరణ్.
శేఖర్ తలదించుకున్నాడు.
‘జాతీయ సమైక్యత అంటే ఏమిటి? చిన్నప్పుడు మనం స్కూళ్లో చదివిన ప్రతిజ్ఞ. భారతీయులందరూ నా సహోదరులే. అని నేర్పితే సమైక్యత సాధించుతాము. ముస్లిం, క్రైస్తవులు నా శత్రువులు, స్త్రీలు పురుషులకి బానిసలు అని నేర్పితే అది సమైక్యత కాదు! సర్వనాశనం అవుతుంది! కాశ్మీర్ ఫైల్స్ సినిమా నేర్పింది. సర్వనాశనమే. దానికి జాతీయ సమైక్యత అవార్డు ఇచ్చారు! అది నీవు గర్వంగా భావించావు. ఆ సినిమా చూసిన నీ కొడుక్కి హత్య చేయాలనే ఆలోచనలు వచ్చాయి. ఏమి జరుగుతుంతో అర్థం అవుతుందా? అడిగాడు కిరణ్.
శేఖర్ కండ్లలో నీళ్లు తిరిగాయి. విశ్వగురు పాలన అంటూ తాను విర్రవీగుతున్నారు. ఆ పాలన ప్రభావం తన పిల్లలనే స్మగ్లర్లుగా, హంతకులుగా మార్చుతున్నది.
‘జై భీమ్ లాంటి గొప్ప సినిమాలు పక్కనపెట్టి, పనికిరాని సినిమాలకు అవార్డులు ఇవ్వడటం ద్వారా భావాలను దారి మళ్లించే ప్రయత్నం జరుగుతోంది. దీనికి ఎక్కువగా మధ్యతరగతి వర్గమే బలయ్యేది. ఇప్పటికైనా అందరం మేలుకుందాం!’ అన్నాడు కిరణ్?
– ఉషాకిరణ్