ప్రపంచంలో ప్రతిపౌరుడూ వినియోగదారుడే. వ్యాపారానికి కేంద్ర బిందువు కూడా అతనే. నేటి డిజిటల్ యుగంలో ఈ-వ్యాపారాలు పెరుగుతున్న వేళ వినియోగదారులు అప్రమత్తత అవసరమైంది. ఒక వస్తువును కొన్నపుడు లేదా అమ్మినపుడు సరైన న్యాయం పొందడం కనీస అవసరం. 1960ల నుంచే వినియోగదారుల చైతన్య ఉద్యమాలు ప్రారంభం కావడం, దినదినం తీవ్రరూపం దాల్చడం, వినియోగదారుల మండలి,ఫోరంలు ఏర్పడడం, వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాలు రావడం గమనిస్తున్నాం. అందులో కొన్ని నిర్దిష్టమైన హక్కుల్ని పరిశీలించాలి.వాటి గురించి తెలుసుకోవాలి. సంరక్షణ హక్కు (రైట్ టు సేఫ్టీ), సమాచార హక్కు (రైట్ టు ఇన్ఫర్‌మేషన్), ఎంపిక హక్కు(రైట్ ఛూజ్), వివరణ పొందే హక్కు(రైట్ టు బి హర్డ్), పిర్యాదుల పరిష్కార హక్కు(రైట్ టు సీక్ రిజ్రెస్సల్), వినియోగదారుల విద్యా హక్కు(రైట్ టు కన్స్యూమర్ ఎడ్యుకేషన్) అనబడే ఆరు హక్కులను భారత వినియోగదారుల పరిరక్షణ చట్టం, 1986 కల్పించడం హర్షదాయకం. వినియోగ దారులకు సంబంధించిన అతి ముఖ్యమైన ఈ చట్టం 24 డిసెంబర్ 1986న పార్లమెంట్ ద్వారా చేయబడిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతియేటా డిసెంబర్ 24న దేశవ్యాప్తంగా ”జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం (నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే)” పాటించుట ఆనవాయితీగా వస్తున్నది.
వినియోగదారుల దోపిడీ, స్వార్థపరమైన వ్యాపారుల అనైతిక విక్రయ పద్ధతులు, వినియోగదారుల అభిరుచులను తమకు అనుకూలంగా మార్చుకోవడం, మోసపోయిన వినియోగదారులకు తిరిగి న్యాయం అందించడం, జరిగిన నష్టానికి, అసౌకర్యానికి పరిహారం పొందడం, అనారోగ్యకర వ్యాపార పద్ధతులను అరికట్టడం, అవసరమైనపుడు వినియోగదారుల ఫోరం,మండలిని ఆశ్రయించడం లాంటి వెసులుబాట్లను వినియోగదారులకు చట్టం కల్పించడం ముదావహం. జాతీయ వినియోగదారుల హక్కుల దినం వేదికగా పలు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు విద్యాలయాలు, పౌర సమాజంలో వినియోగదారుల హక్కుల పట్ల కార్యశాలలు,సెమినార్లు, అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వినియోగదారుల హక్కులకు భంగం కలిగినపుడు మూడంచెల వ్యవస్థ కలిగిన పరిహార మార్గాలను చట్టం కల్పించింది. పరిహార విలువ ఒక కోటి రూపాయల లోపు ఉన్నపుడు జిల్లా స్థాయి వినియోగదారుల వివాదాల పరిహార కమిషన్‌కు పిర్యాదు చేయడం, రూ.కోటి నుంచి పది కోట్ల వరకు రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిహార కమిషన్‌కు, పది కోట్లు దాటితే జాతీయ వినియోగదారుల వివాదాల పరిహార కమిషన్‌కు పిర్యాదులు చేసి ఉచితంగా న్యాయం పొందవచ్చు. 1986 తర్వాత కొన్ని సవరణలతో మరో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-2019ని తీసుకురావడంతో వినియోగదారుడికి న్యాయం జరగడానికి చట్టమే ఒక పదునైన ఆయుధంగా అందించింది. ఐరాస కూడా ప్రతియేటా15 మార్చిన ”ప్రపంచ వినియోగదారుల హక్కుల దినం” పాటించుట కొనసాగుతున్న విషయం మనకు తెలుసు.
ప్రతి పౌరుడు ఒక వినియోగదారుడిగా తమ హక్కులను తెలుసుకుని, మోసపోకుండా, న్యాయబద్దమైన సేవలను పొందడానికి అవసరమైన కనీస వినియోగదారుల అవగాహనను కలిగిఉండాలి. మనల్ని మనమే చట్టం ద్వారా రక్షణ పొందుతూ అనైతిక వ్యాపార పోకడలకు అడ్డుకట్ట వేయాలి. వినియోగదారుల చైతన్య ఉద్యమాల ద్వారా సామాన్య జనాలకు హక్కుల గూర్చి అవగాహన కల్పించాలి. వినియోగదారుడిని మన చట్టాలు శక్తివంతం చేసాయని, వాటి నీడన సురక్షితంగా జీవనయానం సాగించాలని చాటాలి. అడుగడుగునా అప్రమత్తంగా ఉంటూ నైతికత గీత దాటిన వ్యాపారాలకు చట్ట తీవ్రతను పరిచయం చేయాలి.
– డా. బుర్ర మధుసూదన్ రెడ్డి, 9949700037