
ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు,సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండి తమ తల్లిదండ్రులకు,బంధువులకు,స్నేహితులకు వివరించాలని తుంగతుర్తి ఎస్సై ఆర్ క్రాంతి కుమార్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని శ్రీ విద్యాభారతి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు మహిళల భద్రత,రక్షణ,సైబర్ క్రైమ్,ఆన్లైన్ మోసాలు తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. ఈ మేరకు ఆధునిక టెక్నాలజీ కాలంలో సెల్ ఫోన్ వినియోగం పెరిగిపోయిందని,ప్రతి నిమిషం సెల్ ఫోన్ లేనిది ఏ పని చేయలేకపోతున్నామని,మన వ్యక్తిగత సమాచారం అంతా బ్యాంక్ అకౌంట్,పాన్ కార్డు,ఆధార్, పెన్షన్,పౌరసరఫరాల,వినియోగానికి సంబంధించిన అన్ని విధాలుగా మన సెల్ ఫోన్ నెంబర్ అవసరం ఉందని,దాన్ని ఆసరాగా చేసుకుని,సైబర్ నేరగాళ్లు మనకు ఏదో ఆశ చూపించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి ఏటీఎం పిన్ నెంబర్,సి వి వి,బ్యాంకు ఖాతా తదితర వివరాలు కోరితే ఇవ్వరాదన్నారు.ఎలాంటి ఆపద సమయంలోనైనా సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా 100 కు ఫోన్ చేసి పోలీసుల,ఇతర శాఖల యంత్రాంగం సేవలు పొందాలని సూచించారు.విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వారి వెంట స్టేషన్ సిబ్బంది సతీష్,సైదులు,సాయికిరణ్,రవికుమార్, నాగరాజు,ప్రసాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లయ్య,డైరెక్టర్లు వెంకటగోపాల్,నజీరుద్దీన్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.