
నవతెలంగాణ – పెద్దవంగర
విద్యుత్ ప్రమాదాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని విద్యుత్ శాఖ తొర్రూరు డీఈఈ మధుసూదన్ అన్నారు. వడ్డెకొత్తపల్లి పరిధిలోని బొత్తల తండాలో విద్యుత్ శాఖ అధికారులు పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ ప్రమాదాల నివారణ పట్ల రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహ, వ్యవసాయ విద్యుత్ వైర్లకు అతుకులు లేకుండా చూసుకోవాలని సూచించారు. వ్యవసాయ మోటర్లకు స్టార్టర్ బాక్సులు విధిగా వాడాలని, ఎర్త్ చేసుకోవడం ద్వారా విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చునని తెలిపారు. విద్యుత్తును ప్రజలు పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈ రమేష్ బాబు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్ మెన్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.