డెంగ్యూ వ్యాధి పై నివారణ చర్యలు.. అవగాహన..

నవతెలంగాణ డిచ్ పల్లి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలో సోమవారం డెంగ్యూ వ్యాధిపై నివారణ చర్యలు తీసుకున్నారు. గ్రామంలోని ఇంటింటికి తిరిగి డెంగు వ్యాధికి కారకమైనటువంటి దోమల నివారణ మందును పిచికారీని గ్రామపంచాయతీ సిబ్బంది అధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ చేయించినట్లు ఇందల్ వాయి మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగీ వ్యాధి నివారణకు తీసుకోవలసిన చర్యలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ఇంట్లో గల పూల తొట్టిలలు, కొబ్బరి చిప్పలు, వాడేసిన కూలర్లు, ఇతర పాత డబ్బాలలో నిలిచి ఉన్న నీటిని తొలగించాలని ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా అందరూ నీటిని తొలగించి శుభ్రపరుచుకోవాలని లేనిచో ఆ నీటి నిల్వగల ప్రాంతాలలో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, చికూన్ గున్యా మలేరియా వంటి తీవ్రమైన దోమకాటు వ్యాధులు వస్తాయని వై.శంకర్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోఆరోగ్య కార్యకర్త వెంకట్ రెడ్డి, ఆశా కార్యకర్త బండ ప్రమీల గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.