
సిద్దిపేట జిల్లా ములుగు మండలం కేంద్రంలోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్.సి.ఆర్.ఐ)లో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పాములపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెండు గంటల పాటు జరిగిన అవగాహన ఈ కార్యక్రమంలో భాగంగా విష సర్పాలను, విషం లేని సర్పాలను గుర్తించడం, పాము కాటుకు ప్రథమ చికిత్స చేయడాన్ని ప్రత్యక్షంగా చేసి చూపించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అటవీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.ఎస్. శ్రీనిధి మాట్లాడుతూ “సమాజంలో సర్పాలంటే అందరికీ ప్రతికూల భావన ఉంది. పాములన్నీ ప్రమాదకరమైనవి కాదు. కేవలం కొన్ని రకాల పాములు మాత్రమే విషపూరితమైనవి మిగిలిన అనేక రకాల పాములు పంటలను నాశనం చేసే ఎలుకలను, ఇతర కీటకాలను తిని పర్యావరణాన్ని పరిరక్షిస్తూ రైతులకు మేలు చేస్తున్నాయి. పాము కరిచినపుడు ప్రథమ చికిత్స చాలా ముఖ్యమైనది. మనం బ్రతుకుతూ ఇతర జీవరాశులను బ్రతకనివ్వాలి అనే స్పృహ కలిగి ఉండి పాములను రక్షించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో 120 మందికి పైగా ఎన్ఎస్ఎస్ వాలెంటీర్లు, కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.