పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన..

నవతెలంగాణ – రెంజల్ 

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాల పరిశుభ్రత పై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వైద్య అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. శుక్రవారం రెంజల్ మండలం కళ్యాపూర్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. వర్షాకాలంలో కొత్త నీరు వచ్చే అవకాశం ఉన్నందున, విద్యార్థిని విద్యార్థులు తాగునీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు సమకూర్చిన నీటి తొట్టిలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. కలుషితమైన నీటి వల్ల పచ్చ కామెర్లు, ఫైలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారులు శ్రావణ్ కుమార్, కరిపే రవీందర్, స్థానిక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.