ఓటు నమోదు, హక్కు పై విద్యార్ధులకు అవగాహన..

 
– పాల్గొన్న ఎం.పి.డి.ఒ శ్రీనివాసరావు..
– యువతరం తోనే సమసమాజం రూపకల్పన – ఎం.పి.పి శ్రీరామమూర్తి.
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నికలు తరుణం సమీపించడంతో సిబ్బంది వారికి కేటాయించిన ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు కొత్త ఓటు నమోదు,మార్పులు చేర్పులు పై అశ్వారావుపేట నియోజక వర్గం ఎన్నికల అధికారి,అదనపు కలెక్టర్ రాంబాబు వారం వారం అవగాహన, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు, యుక్త వయస్సు కు దగ్గర పడుతున్న ఉన్నత పాఠశాల, కళాశాలల విద్యార్థిని, విద్యార్ధులకు ఓటు నమోదు, ఓటు హక్కు, వినియోగం పై అవగాహన కల్పిస్తున్నారు. పట్టణ పరిధిలోని పోలింగ్ బూత్ ల సెక్టోరియల్ అధికారి,ఎం.పి.డి.ఒ శ్రీనివాసరావు గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మీ ఓటు హక్కు నీ వినియోగించుకోవాలని,అలాగే ఈ సంవత్సరం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొత్త ఓటరుగా నమోదు చేయించుకోవాలని, వచ్చే ఎన్నికలలో మొత్తం 6 సార్లు మీ ఓటు నీ వినియోగించుకోవచ్చని, భావి తరాలు దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు  నరసింహ రావు, అశ్వారావుపేట ఈ.ఒ హరికృష్ణ,పేరాయిగూడెం కార్యదర్శి కోటమర్తి శ్రీరామమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.