స్పైసేస్ బోర్డు ఆధ్వర్యంలో సుగంధ పంటలపై అవగాహన

– పంటల సాగులో రసాయన మందులు తగ్గించాలి
– కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ విజిస్నా 
నవ తెలంగాణ – మల్హర్ రావు
పంటల సాగులో రసాయనక మందులు తగ్గించి, సేంద్రియ ఎరువులు వాడాలని స్పైసేస్ బోర్డు అసిస్టెంట్ డైరెక్టర్ విజిస్నా, వ్యవసాయ రిటైర్డ్ శాస్త్రవేత్త ఉపేందర్ రెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు అధ్యక్షతన మండలంలోని ఆయా గ్రామాల రైతులతో మిర్చి, పసుపు నాణ్యత అభివృద్ధి కొరకు 2024-25 రైతు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పంటల సాగులో రసాయన ఎరువులు తగ్గించి, సేంద్రియ ఎరువులువాడడం ద్వారా పంటల దిగుబడితోపాటు మానవాళి ఆరోగ్యానికి ఎంతో శ్రేష్ఠకరమన్నారు. వ్యవసాయ భూముల్లో శాశ్వతంగా ఒకే పంట వేయకుండా పంటమార్పిడి వ్యవసాయం చేస్తే పంటల దిగుబడితోపాటు రోగనిరోధకశక్తి పెరుగుతుందన్నారు. భూముల్లో పోషకాలు, ఖనిజ లవణాలు పెంచేందుకు పంట మధ్య కాలంలో జనుము,పచ్చిరొట్టె వేయాలన్నారు. అలాగే మిర్చితోపాటు పసుపు,మొక్కజొన్న,జొన్న తోపాటు సుగంధ ద్రవ్యాల పంటలను సైతం పండించాలని సూచించారు. ఎడాపెడా ఇష్టారాజ్యంగా రైతులు ఎరువులు వాడవద్దని, అలవాడితే భూములు దెబ్బతిని భవిష్యత్ లో పనికి రాకుండా పోతాయని,హార్టీ కల్చర్,వ్యవసాయ,వ్యవసాయ శాస్త్రవేత్తలు సలహాలతో రైతులు పంటలు సాగుపై ఎరువులు వాడాలని సూచించారు.మండలంలో మిర్చి తోటలు పెట్టిన రైతులు ఏటా అప్పుల పాలవడం తప్పా దిగుబడులు లేవని,వరి వేసిన రైతులకే మేలు జరుగుతుందని ఎపిపి అభిప్రాయం తెలిపారు. రైతులు సంయుక్తంగా ముందుకు వెళుతూ ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు పొందుతూ,వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంకరి సత్తయ్య, ఏఈఓ దుర్గాప్రసాద్, సింగిల్ విండో డైరెక్టర్ ఇప్ప మొoడయ్య, హార్టీ కల్చర్ అధికారులు,రైతులు పాల్గొన్నారు.