పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన ర్యాలీ

నవతెలంగాణ – కంటేశ్వర్
ఈ నెల 3 , 4 , 5 తేదీలలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. పాత కలెక్టరేట్ మైదానం నుండి ప్రధాన వీధుల గుండా మెడికల్ కళాశాల వరకు ఈ ర్యాలీ కొనసాగింది.  జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. చిన్నారులు పోలియో వ్యాధిబారిన పడకుండా ఈ నెల 3న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. అన్ని నివాస ప్రాంతాలలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ఆసుపత్రులలో, అంగన్వాడీ కేంద్రాలు, పల్స్ పోలియో బూత్ లు, రైల్వే స్టేషన్, బస్టాండ్ ల వద్ద ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలియో నివారణకై చుక్కల మందు వేయడం జరుగుతుందన్నారు. పిల్లలు జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా వారికి చుక్కల మందు వేయించాలని సూచించారు. జిల్లాలో ఐదేళ్ల లోపు వయస్సు కలిగిన 191081 మంది చిన్నారులకు చుక్కల మందు వేసేందుకు 1007 పల్స్ పోలియో బూత్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటితో పాటు మరో 37 ట్రాన్సిట్ బూత్ లు, 37 మొబైల్ బూత్ లు నెలకొల్పామని వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన సిబ్బందిని నియమిస్తూ, 2.40 లక్షల పోలియో డోస్ లను వారికి సమకూర్చడం జరిగిందని డీ.ఎం.హెచ్.ఓ వివరించారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు వేయించాలని కోరారు. పల్స్ పోలియో అవగాహన ర్యాలీలో వైద్యారోగ్య శాఖ అధికారులు, ఏ.ఎం.ఎంలు, ఆశ వర్కర్లు, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు.