”నేలరాలిన మందారాలు మళ్ళీ పూయవురోరన్నా, నింగికెగసిన తారాజువ్వలు నేల దిగిరావోరన్నా” నిజమే కదా అందుకే నన్నయ ”గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్” అన్నాడు. నూటికో కోటికో పుడతారు మహాత్ములు.వారే సమాజానికి దిశా నిర్దేశం చేసే ప్రయత్నం లేదా పోరాటం చేస్తారు. అలాంటి వారిలో ‘గద్దర్‘ కూడా ఒకడు.
తెలంగాణ మాగానంలో పుట్టిన విప్లవ తార గద్దర్. సమాజంలోని హెచ్చుతగ్గులను మానవ విలువలను కళ్లార చూసి అనుభవించిన కుటుంబ నేపధ్యం నుండి వచ్చినవాడు. మెదక్ జిల్లా, తూప్రాన్ లాంటి వెనుకబడిన ప్రాంతం నుండి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి విశాలమైన వేదిక నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్ళేలా అప్పుడే ఉసిగొల్పి వుండవచ్చు. కెనరా బ్యాంకులో క్లర్కుగా చేరినా మనసు అప్పుడప్పుడు అతడిని ప్రశ్నించి ఉండవచ్చును. అందుకే తుపాకి చేబూని పోరుబాట పట్టినాడు. జన్మతా వచ్చిన లక్షణాలు కళ్ళారా చూసిన వివక్ష, పేదరికపు అనుభవాలు, ఆనాటి పాలనా వ్యవస్థ అతన్ని ఆ దిశగా మళ్ళించి ఉండవచ్చు. ఏదీ ఏమైనప్పటికి తల్లితండ్రుల చైతన్యం ‘గద్దర్’ కి విద్యార్ధి దశలోనే అబ్బింది. అలాగే తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొనేలా చేసింది కూడా. పాటను తూటగా మలిచి ప్రజలపైకి పాలకుల పైకి సంధించిన విప్లవ యోధుడు అతడు.
‘గద్దర్’ (31-01-1949 ఆగష్టు 6 2023) పూర్తి పేరు గుమ్మడి విఠల్ రావు, తల్లి గుమ్మడి లచ్చుమమ్మ, తండ్రి గుమ్మడి శేషయ్య. గద్దర్‌కు ఒక అన్న, ముగ్గురు అక్కలు. గద్దర్‌ను ఒక కోణంలో చూడలేం. తిరుగుబాటుదారుడిగా, విప్లవ కవిగా, గాయకుడిగా, ప్రదర్శనకారుడిగా, సమ్మెహన శక్తిగా, ఇలా ఎన్ని చెప్పినా తక్కువే, అన్ని పాత్రలలో ఒదిగిపోయి ఒక ఉద్యమ నిర్మాణం చేశాడు. నా పరిశోధన ప్రకారం ‘గద్దర్’ కన్నా ముందు ఇంత గొప్ప సజనకారుడు పాటల ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరూ లేరు. ‘గద్దర్’ కు సమాంతరంగా శ్రీకాకుళం నుండి ‘వంగపండు ప్రసాదరావు’ తన పాటల ద్వారా ఆంధ్రప్రాంతంలో ప్రజలలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇంకా కొద్దిమంది తెలంగాణ ప్రాంతం నుండి పాటలు రాసి ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేశారు, వారిలో బండి యాదగిరి, గూడ అంజయ్య, సుద్దాల హనుమంతు, జయరాజ్, గోరేటి వెంకన్న, అందెశ్రీ మొదలైన వారున్నారు.
ఇవ్వాళ మహిళలపై జరుగుతున్న వివక్షపై అప్పట్లోనే ”కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ”, అంటూ మహిళల్ని చైతన్యం చేసి ఉద్యమంలో స్త్రీలను కూడా భాగస్వాములను చేశాడు. ”అమ్మ తెలంగాణ మా ఆకలి కేకల గానమా” అంటూ తెలంగాణా బతుకు చిత్రాన్ని దోపిడీ వ్యవస్థను, కళ్ళముందుంచాడు. ఈ పాటలో పదాలను పేర్చిన విధానం నాకు గిజిగాడు పక్షిగూడు అల్లినట్లుగా అందంగా ఒక్కొక్క ప్రాంతం ప్రాముఖ్యతను దాని వాస్తవిక పరిస్థితిని, కష్ణ, గోదావరి నీళ్ళు మన ప్రాంతం నుండి ప్రవాహిస్తున్నా బీడు భూములు ఎందుకున్నాయి అంటూ పాలకులను ప్రశ్నిస్తాడు. వెండి బంగారం దండిగా ఉన్నా బోడి మెడతో బొల్లున ఏడ్చినది అంటూ తెలంగాణ ప్రాంతపు ఆవేదనకు అక్షర రూపం ఇచ్చి ప్రజల్ని ఆలోచింపజేశాడు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ఊరు ఊరునా వాడవాడలా ప్రజల్ని చైతన్యం చేయటంలో ప్రధాన భూమిక పోషించింది ఆ పాట.
”పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా” అంటూ కాలికి గజ్జెకట్టి, నడుముకు ధోతీ చుట్టి భుజంపై గొంగడి, చేతిలో కర్ర, ఎర్ర రుమాలుతో తెలంగాణ ప్రాంతం మొత్తం చుట్టిన ఉద్యమవీరుడు గద్దర్. ఈయనను చాలామంది విమర్శించిన వారూ వున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నేను మాత్రం ఆయన్ను అభినవ వాగ్గేయకారుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, దిక్కార గొంతుకగా, సామాజిక అసమానతలపై తిరుగుబాటును ప్రకటించిన విప్లవకారుడిగానే పరిగణిస్తాను. అన్నింటికీ మించి గొప్ప సాహితీవేత్తగా, అంతకు మించి సజనకారుడిగా వేల ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మంది నేటితరం కళాకారులకు స్ఫూర్తిప్రధాత.
తెలంగాణ సమాజం ప్రస్తుతం ‘సంఘర్షణాత్మక స్తబ్దత’ వాతావరణంలో ఉంది. అలాంటి స్తబ్దతను ఛేదించాలంటే ఒక గొప్ప కళాకారుడు అవసరం. సామాజిక అసమానతలను, పాలకుల అవినీతి అక్రమాలను పాట ద్వారా తెలంగాణ సమాజం మొత్తం తిరిగే గద్దర్ లాంటి యుద్ద నౌక ఇప్పుడు అవసరం. ”కిర్రు కిర్రు చెప్పులోయమ్మ” అన్నా, ”నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి… ఆడపిల్ల పుట్టిందని ఓ లచ్చ గుమ్మడి” అంటూ అసమానతలపై పాటే అస్త్రంగా ఎక్కు పెట్టి మనల్ని ఆలోచింపజేస్తాడు. ప్రజలకు ఏం కావాలో, పాలకులు ఏం ఇచ్చి మభ్యపెడ్తున్నారో కళ్ళకు కట్టినట్లు చెప్పాడు. కాలమే అటువంటి వ్యక్తిని సష్టిస్తుందనేది జగమెరిగిన సత్యమే.
అన్నాచెల్లెల అనుబంధానికి మానవ సంబంధాల గాఢత నిలువెత్తు నిదర్శనం ‘ఒరేరు రిక్షా’ సినిమా లోని ”మల్లె తీగకు పందిరివోలే మసక చీకటిలో వెన్నెల వోలె నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోబుట్టిన ఋణం తీర్చుకుంటనే చెల్లెమ్మ” అన్న పాట నేటికి తెలుగు ప్రజల గుండెల్లో పదిలంగా వుంది.
గద్దర్ ఒక ప్రభంజనం, ఒక ఉప్పెన, జనసమ్మెహన శక్తి, ప్రజా ఉద్యమకారుడు, ఒక చరిత్ర, విప్లవం. ఎర్రజెండా చేతబట్టి ఎన్ని వేల వేదికలపై స్వయంగా రాసి అభినయించి ప్రజలను ఉర్రూతలూగించిన సంఘటనలు కోకొల్లలు. మలిదశ ఉద్యమ సమయంలో జరిగిన కళాకారుల ”ధూంధాం” ఆటపాటలు, అందులో గద్దర్ పాత్రను ఎవరు చరిత్ర నుండి చెరిపివెయ్యలేరు. జన్మనిచ్చిన అమ్మ కష్టాన్ని స్వయంగా చూసిన దశ నుండి సమాజంలో తను పెరిగి పెద్దవాడైన తర్వాత అసమానతలపై చలించి రాసిన పాటలు ఎన్నో ఎన్నెన్నో.
ఒక్కసారి ప్రజా ప్రతినిధిగా గెలిచి కోట్లకు కోట్లు వెనకేసుకొని తరతరాలకు సరిపోయే ఆస్తులను పోగేసుకుంటున్న నాయకులు ఉన్న ఈ కాలంలో కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసి తన ఆట, పాట ద్వారా అందరి గుండెల్లో చెరగని ముద్రను వేసి పాటకు విరామం ఇచ్చి తన శరీరానికి శుభం కార్డువేసి వెళ్ళిపోవడం బాధకల్గించే విషయమే. అజ్ఞాతంలో ఉన్నప్పుడే ఎన్నోసార్లు ఎన్ కౌంటర్ నుండి బయటపడి, అనంతరం జనజీవన స్రవంతిలోకి వచ్చాక ఉమ్మడి రాష్ట్రంలో (1997 ఏప్రిల్ 06) శరీరంలోకి ఆరు బుల్లెట్లు దూసుకొని వెళ్ళినా మత్యువు నుండి బయటపడి తిరిగి ప్రజలకు పాటకు ఉన్న అనుబంధాన్ని మళ్ళీ జత చేశాడు. నాటి నుండి నేటి వరకు వెన్నుముకలో ఒక తూట మిగిలి ఉన్నా, శరీరం సహకరించకున్నా 76 ఏళ్ల వయస్సులో కూడా తన లక్ష్యం ఇంకా పూర్తికాలేదని చివరి వరకు ఆడిపాడి మనల్ని చైతన్యం చేశాడు. ఏది ఎమైతేనేం సుమారు 5 దశాబ్దాల పాటు పాట ద్వారా ప్రజల్లో సాంస్కతిక చైతన్యాన్ని, సామాజిక వైరుధ్యాల మార్పుని ఆశించి అభినయించి ప్రజలను ఆలోచింపజేసిన వ్యక్తి. అతడు ఆశించిన సామాజిక విప్లవం ఈ తరంలో కాకపోయిన భవిష్యత్ తరాలు కచ్చితంగా అనుభవిస్తాయి. ఎందుకంటే సమాజం నిత్య చైతన్యవంతమైంది కదా! మనం ఇప్పటికి కూడా ఆదిమ సమాజంలో లేం. ఎంతో మార్పుని నేటి సమాజం అందిపుచ్చుకుంది. వ్యక్తుల మధ్య వైరుధ్యాలు ఇలాగే కొనసాగితే తప్పకుండా వర్గ సంఘర్షణ ఏర్పడుతుంది. తద్వారా సమసమాజ స్థాపనకు దారులు తెరుచుకుంటారు. ”బలవంతులు దుర్బల జాతిని బానిసలు కావించారు. నరహంతకులు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి” అన్న శ్రీశ్రీ స్వయంగా గద్దర్‌ను తన భావజాలాన్ని పాటల ద్వార ప్రజల్లోకి తీసుకెల్తున్నాడని చెప్పటం చారిత్రక సత్యం.
గద్దర్‌ను భిన్న పార్శ్వాల్లో పరిశీలిస్తే దాదాపు పది పరిశోధన గ్రంథాలు రాయవచ్చు. విప్లవకారుడిగా, తిరుగుబాటుదారుడిగా, మార్క్స్ సిద్ధాంతాల ప్రచారకర్తగా, మానవ సంబంధాల వారధిగా, సాహితీవేత్తగా, విప్లవ సాహిత్యానికి సారధిగా, ఇలా అనేకనేక కోణాలలో గద్దర్‌ను చూడవచ్చు. అందుకే ఎంతగా రాసినా ఒడువని పరిశోధన వ్యాసం గద్దర్ వ్యక్తిత్వం.
(జనవరి 31 గద్దర్ జయంతి సందర్భంగా)
డా||మహ్మద్ హసన్,
9908059234