శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కెజెఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె.రాజేష్ నిర్మించగా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా తమిళనాడులో విడుదలైంది. అయలాన్ అంటే ఏలియన్. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే తొలిసారి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న తెలుగులో విడుదల చేయనున్నట్లు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెలియజేసింది. తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ అందుకున్న ‘వరుణ్ డాక్టర్’ సినిమా తర్వాత శివ కార్తికేయన్, కెజెఆర్ స్టూడియోస్, గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. తమిళనాడులో ‘అయలాన్’ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కేవలం నాలుగు రోజుల్లో రూ .50 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ వారంలో వంద కోట్ల మార్క్ చేరువ కానుంది. కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ, ‘హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని సినిమా ఇది. ఏఆర్ రెహమాన్ గారి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి’ అని తెలిపారు.