– బీజేపీ కుయుక్తులను తిప్పికొట్టండి : పార్టీ శ్రేణులకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సెంటిమెంట్‌ను రగిల్చి లబ్ది పొందేందుకు అయోధ్య రామాలయ అంశాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా ఎత్తుకుందనీ, దాని కుయుక్తులను తిప్పికొట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ముఖ్దూంభవన్‌లో బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోడీ సెంటిమెంట్ వాతావరణాన్ని సష్టించి, రామాలయ ప్రారంభోత్సవాన్ని ఓట్లు దండుకునే కార్యక్రమంగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయని తెలిపారు. సీపీఐ శ్రేణులు ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రమాదకారిగా మారిందనీ, సంస్థాగత వ్యవస్థలను నియంత్రిస్తోందని విమర్శించారు. అందరికీ సన్ స్ట్రోక్ వస్తే, మాజీ సీఎం కెేసీఆర్‌కు డాటర్ స్ట్రోక్ వచ్చిందనీ, కుమార్తె కోసం ఆయన బీజేపీతో రాజీపడ్డారని విమర్శించారు. సీపీఐ జాతీయ సమితి సమావేశాలు హైదరాబాద్‌లో ఫిబ్రవరి 2,3వ తేదీలలో జరగనున్నట్టు నారాయణ తెలిపారు. ఈ సమావేశాలకు పార్టీ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాబీర్ పాషా తదితరులు హాజరయ్యారు.