గవర్నర్‌కు అయోధ్య స్టాంపులు అందజేత

గవర్నర్‌కు అయోధ్య స్టాంపులు అందజేతనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అయోధ్య రామజన్మభూమి ఆలయంపై తపాలాశాఖ ముద్రించి న ప్రత్యేక స్టాంపుల్ని గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌కు తెలంగాణ శాఖ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పీవీఎస్‌ రెడ్డి అందచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరఫున బుధవారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన గవర్నర్‌కు వీటిని అందచేశారు. గతనెల 18వ తేదీ ప్రధానమంత్రి మోడీ అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా దీనిపై తపాలాశాఖ ప్రత్యేకంగా ఆరు స్టాంపుల్ని ముద్రించిన విషయం తెలిసిందే. వీటిని ఆరోజు ప్రధాని ఆవిష్కరించారు. సరయూనది నుంచి తీసిన నీరు, ఆయోధ్య మట్టితో పాటు బంగారు రేకు, గంధపు చెక్క సువాసన వంటి ప్రత్యేక లక్షణాలతో ఆరు స్టాంపుల మినియే చర్‌ షీట్‌ను పోస్టల్‌ శాఖ ముద్రించిన విషయం తెలిసిందే. ఈ షీట్‌తో పాటు రామాయణంపై విడుదల చేసిన ఫిలాటెలిక్‌ మెటీరియల్‌ ”రామాయణ సాగా ఆఫ్‌ శ్రీరామ్‌, ఎ జర్నీ త్రూ స్టాంప్స్‌” పుస్తకాన్ని కూడా ఆయన గవర్నర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తపాలాశాఖ సేవల్ని కొనియాడారు.
సోలార్‌పై పోస్టల్‌శాఖ సర్వే
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్‌- ముఫ్త్‌ బిజిలీ యోజన పథకం’ అమలు కోసం పోస్టల్‌శాఖ సర్వే నిర్వహిస్తున్నదని తపాలాశాఖ సికింద్రాబాద్‌ డివిజన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు. ఈ స్కీం ద్వారా ఇండ్ల పైకప్పులపై సోలార్‌ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకునే అర్హులైన కోటి మంది లబ్దిదారులకు 300 యూనిట్ల వరకు ప్రతి నెల ఉచిత విద్యుత్‌ అందిస్తారని తెలిపారు. సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు ఖర్చులో దాదాపు 40 శాతం వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తుందని వివరించారు. ఈ పథకం ద్వారా లబ్ది పొందాలనేకునే వారి వివరాలను సేకరించేందుకు పోస్టల్‌ శాఖ చేస్తున్న సర్వేలో ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. సమీపంలోని పోస్ట్‌ ఆఫీస్‌ లేదా పోస్ట్‌ మ్యాన్‌ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.