ఆయుర్వేదం కనుమరుగేనా.?

– మూతపడిన ఆయుర్వేద కేంద్రాలు
– అందని ద్రాక్షగా వైద్యం
నవతెలంగాణ –  మల్హర్ రావు
ఇంగ్లీష్ మందులకు డిమాండ్ పెరగడం, ఇందుకు తోడుగా ఆయుష్ కేంద్రాల్లో వైద్య సిబ్బంది కొరతతో రానురాను ఆయుర్వేద వైద్యం అందని ద్రాక్షలా మారింది. ప్రభుత్వం లక్షలు ఖర్చుచేసి ప్రవేశ పెట్టిన ఆయుష్ కేంద్రాలు కనుమరుగైయ్యాయి. ఇందుకు సాక్షాత్తు నిదర్శనం మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఆయుష్ వైద్యశాల గది మూతబడటం. అందులో ఉన్న మందులు చీమలు, పురుగుల పాలవడమే.అ లాగే వళ్లెంకుంట గ్రామంలో ఉన్న యునాని ఆరోగ్య ఉపకేంద్రము భవనం ప్రమాదకరంగా మారడంతో  కూల్చివేసిన పరిస్థితి. ఫలితంగా మండల ప్రజలకు యునాని, హోమియో, ఆయుర్వేద చికిత్స అందని ద్రాక్షలాగా కనుమరుగైపోయింది. ప్రభుత్వం ఆయుష్ కేంద్రాల పేరుతో అందించే సేవలు క్షేత్రస్థాయిలో అందడం లేదు.ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఆయుష్ కేంద్రానికి ఒక కంపాడర్ మాత్రమే దిక్కవడంతో గమనార్హం. ఆరోగ్య కేంద్రంలో ఓ గదిలో ఆయుర్వేద ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారి సంవత్సరం క్రితం బదిలిపై వెళ్లారు.అప్పటి నుంచి వైద్యాశాలకు వైద్యాధికారి,సిబ్బంది ఎవరు రాలేదు.ప్రస్తుతం ఆసుపత్రిలో ఎవరు లేరు.పార్మసీస్ట్,కాంపౌండర్ ఉన్నట్లుగా రికార్డుల్లో ఉన్న ఏనాడు ఆసుపత్రిలో కనిపించిన దాఖలాలు లేవు.ప్రజలకు సేవలందించిన ఆనవాళ్లు అసలే లేవు.వైద్యశాలపై సంబంధించిన జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆసుపత్రి ని పట్టించుకునేవారే కరువైయ్యారు.ప్రభుత్వం లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన వైద్యశాల, మందులు ఎందుకు పనికి రాకుండా పోవాల్సిన దుస్థితి.ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఆయుర్వేద వైద్యశాలపై పర్యవేక్షణ చేసి, మండల ప్రజలకు ఆయుర్వేద వైద్యం అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.