పట్టణంలో ఆజాద్ చంద్రశేఖర్ వర్ధంతి కార్యక్రమం

నవతెలంగాణ – ఆర్మూర్
పీడీఎస్ యూ, పీ వై ఎల్ ల ఆధ్వర్యంలో కామ్రేడ్ ఆజాద్ చంద్రశేఖర్ 90 వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు ఎం.నరేంధర్ మాట్లాడుతూ..దేశం గర్వించదగ్గ యువకుల్లో చంద్రశేఖర్ అజాద్ కూడా ఒకరు. 1903 జులై 23 న అలహాబాద్‌లోని ఓ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అజాద్ అసలు పేరు చంద్రశేఖర్ సీతారామ్ తివారి. అజాద్ తల్లి అతడిని సంస్కృతంలో పెద్ద పండితుడు కావాలని కలలు గన్నారు. అయితే చదువు అబ్బకపోవడంతో తల్లిదండ్రుల ఒత్తిడి భరించలేక తన పదమూడో ఏట ముంబయికి పారిపోయి ఓ మురికివాడలో కూలి పనిచేసుకుంటూ జీవనం సాగించాడు అని అన్నారు. న్యాయవాది 15 రోజులు జైలు, పదిహేను కొరడా దెబ్బలు శిక్ష విధించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భగత్ సింగ్, రాజ్‌గురు, పండిత రామ్‌ప్రసాద్‌లతో కలిసి పనిచేశార నీ. వీరి నాయకత్వంలో ఏర్పడిన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌కు ఆజాద్ ముఖ్య వ్యూహకర్తగా పనిచేశార నీ అన్నారు. 1929లో లాలాలజపతి రయ్‌పై అకారణంగా దాడిచేసి ఆయన చావుకు కారణమైన బ్రిటిష్ అధికారి స్కాట్ హత్యకు పథకం వేశారు. అయితే పోలీస్ స్టేషన్‌ను నుంచి స్కాట్ బయటకు వచ్చే సమయంలో అతడిని చంపడానికి పథకం వేసినా అది విఫలమైందని, ఆ సమయంలో బయటకు వచ్చిన సాండర్స్‌ను స్కాట్‌గా భావించి తుపాకితో కాల్చి చంపారు. వీటిలో కీలకంగా వ్యవహరించిన అజాద్ యువతలో దేశభక్తి రగలించాడనడంలో ఎలాంటి సందేహం లేదు. చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల తూటాలకు ఈ ఆజాద్‌ బయపడడంటూ చేసిన నినాదం జాతీయోద్యమ కాలంలో ప్రాచుర్యం పొందింది. 1931 ఫిబ్రవరి 27 ఉదయం అలహాబాద్‌లోని అల్‌ఫ్రెడ్ పార్క్‌లో సుఖదేవ్‌తో సమావేశమైనట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆజాద్‌పై హఠాత్తుగా దాడి చేశారు. వారి నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించిన అజాద్‌పై పోలీసులు కాల్పులు జరపడంతో భయపడకుండా వారిని ఎదురించాడు. సుఖ్‌దేవ్ అక్కడ నుంచి తప్పించుకునే వరకు వారితో పోరాడి అజాద్ తన రివాల్వర్‌తోనే ప్రాణార్పణ చేసుకున్నాడు.కేవలం 27 సంవత్సరాల వయస్సులో దేశ ప్రజల స్వేచ్చా,స్వాతంత్ర్యాలు కోసం విదేశీ దోపిడీ వ్యతిరేకంగా తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించాడు.అమరుడు చంద్రశేఖర్ ఆజాద్ కు జోహార్లు తెలియజేస్తూ,ఆజాద్ స్ఫూర్తితో విద్యార్థులు, యువకులు ప్రజలపై జరుగుతున్న దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా  పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కార్యదర్శి  రవి నాయకులు నజీర్ ఆఫజల్ సంజయ్  ఏరియా అధ్యక్ష కార్యదర్శులు ఎల్ అనిల్, డి నిఖిల్ నాయకులు రాకేష్ చారి తదితరులు పాల్గొన్నారు..