ఆజాదీ హై కిస్కా

Azadi Hai Kiskaప్రపంచజనుల బాధ తనబాధగా రాసాడని శ్రీశ్రీని, తన బాధను ప్రపంచబాధ చేసాడని కృష్ణశాస్త్రిని వ్యాఖ్యానిస్తుంటారు సాహిత్యకారులు. కాని, కవులంతా రుఢాలీలే అంటాడొక కవి. రుఢాలీలు కిరాయికి ఎవరి చావుకో, కర్మకాండలకో ఏడుస్తుంటారు. కొందరు సంపన్న వర్గాలవారు తమ దు:ఖాన్ని కూడా దు:ఖించలేరు. తనది కాని దు:ఖాన్ని తన దు:ఖంగా గీతించే వాగ్గేయకారుడు కవి. ఎవరివో వెక్కిళ్లు తన గొంతులో, ఎందరి వేదనలో తన కవిత్వంలో, సముద్రమై తాను, కెరటాలై తన కవితలు… నిరంతర ఘోష తన కవిత్వమై కవి నిత్య నూతనంగా… కరిపె రాజ్‌కుమార్‌ ‘ఆజాదీ’ కవితా సంకలనమౌతాడు.
‘వేట కొడవలి గాయాల…
పరిహాసపు పరంపరాగత వెక్కిళ్లు’ కవి గొంతులో,
‘అర్థనగ శరీరాలతో/ అక్షరశాలకెళితే/ ముక్కులు మూసుకునే/ కస్తూరీతిలకులు/ అపరాహ్న భోజనానికి/ సత్తుగిన్నెల్లోనే సద్దివడ్డింపులు/ అయినవారికి ఆకుల్లో/ కానివారికి కంచాల్లో’… (వెక్కిళ్ళు)
నిన్నమొన్నటిదాకా విశ్వవిద్యాలయాల్లోనూ ఎవరి ‘బంతి’వారిదే. కాకా హోటల్లో ఇప్పటికీ మా గ్లాసులు మావే. ఇదేం సమాజం. ఇదేం వేర్పాటు. వేలయేండ్ల అంటరానితనం ఇంకా.. ఎన్నెన్ని రూపాల్లో… ఎప్పటిదాక ఈ బాధ కవి గుండెల్ని తొలుస్తూనే వుంది. తండ్లాడిన గొంతుల్లో తడి ఆరని నినాదాలు.
గోవుకు, కుక్కకు, పిల్లులకున్న గౌరవం లేదా సాటి మనిషంటే. ఎందుకు వీళ్ల శాస్త్రాలు, చదువులు తగులబెట్టక.
‘దంతాలున్న ఒక పిచ్చి ఏనుగు/ దానిపై చెదలుపట్టిన అంబారీ/ చోద్యాలు చూసే మావటీలు’
మదపిచ్చి దంతాల ఏనుగు ధ్వంసరచన, హింసరచన చేసే విధ్వంసకారులకు ప్రతీక. దాని మీద చెదలుపట్టిన అంబారీ పురాతన సనాతనత్వానికి పీఠం. దీన్నంతా తమాషాగా చూసే మావటీలు మన ఏలికల ప్రతిబింబాలు. ధ్వంసరచనలతోనే వారికి గద్దెలు దక్కుతాయి. వాళ్ళ చర్యలు దంతమదగజ ధ్వంసనమే.
‘మూతులు కుట్టేసి, చేతులు కట్టేసి/ విద్వేషాగ్నులను రగిలించడం ఎంతసేపు?’…
వారికదో వినోదం. కుల, మత, జాతి, ప్రాంత విద్వేషాలను రెచ్చగొట్టి, మంటలు పెట్టడానికి ఎంతసేపు? సంయమన సాధన ఏముండదు. దొంగమాటలు తప్ప. వైవిధ్యాలను వైరుధ్యాలుగా మార్చి వివాదాలు పుట్టించేది వాళ్లే. వాళ్ళది అధికార మతం. నేటి సామాజిక పరిణామాల మీద గొప్ప సెటైర్‌ ఈ ‘పిచ్చి ఏనుగులు’ కవిత.
రోడ్ల విస్తరణ, ప్రాజెక్టుల ముంపులు ఎందరి జీవితాలను అస్తవ్యస్తం చేస్తాయి. కండ్ల ముందర తాతలనాటి ఇండ్లు, పొలాలు, తర తరాల చరిత్రలు కూలిపోతారు, మునిగిపోతారు. మనుష్యులు వలసపోవాలె. అధికార గారడీవాండ్ల చేతుల్లో గుంజకు కట్టిన అంగట్ల ముంగిసలై అల్లల్లాడుతారు ప్రజలు. నీళ్ల ముంపులో కొట్టుకుపోయిన గ్రామాల ప్రజలు త్యాగధనులుగా మిగిలిపోయారు.
‘ఆజాదీ’ కరిపె రాజ్‌ కుమార్‌ నాలుగవ కవితా సంపుటి. వైవిధ్యవస్తు సంపన్నమైన వచనకవితాకావ్యం. తనదొక ప్రత్యేక అభివ్యక్తిశైలి. తన కవితల నిండా తనదైన పదసంపద. భావంలో నవ్యత, భాషలో నవ్యత. కొత్త పదబంధకల్పన చేసాడీ కవి.
మీనాల మీసాలను/ అవలీలగా పట్టేయగలడు.
మార్కెట్‌ మాయలో పడని వినియోగదారుడు లేడు. ఎన్ని మాయాజలతారులు విసిరి జనాలను వెర్రివాళ్ళను చేస్తుంది అంగడి.
“Come buy, come buy” was still their cry./ Laura stared but did not stir,/ Long’d but had no money:/ The whisk-tail’d merchant bade her taste/ In tones as smooth as honey,/ The cat-faced purr’d,/ The rat-faced spoke a word/ Of welcome, / and the snail-paced even was heard;/ One parrot-voiced and jolly/ Criedw “Pretty Goblin” still for “Pretty Polly”—/ ‘One whistled like a bird.
ఎన్ని దొంగ ముఖాలతో వ్యాపారానికి దిగుతారో రాస్తుంది.
దేశమంతటా మొన్నటి భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరిగాయి. స్వేచ్ఛ ఎవరికి దక్కింది. ప్రజాస్వామ్యం ఎంత మిగిలింది?
విముక్తి పోరాటాలలో/ విగతజీవులైన వీరులెందరు?/ కార్మిక కర్షక ఉద్యమాలలో/ అస్తమించిన అమరులెవ్వరు?/ తాడోపేడో తేల్చుకునే సన్నద్ధతలో/ తలలు తెగిన తారకలెన్ని?/ జైళ్ళలో మగ్గి జీవచ్ఛవాలైన/ జాగృత వసంత కోకిలలెన్ని?
కవి రాజ్‌ కుమార్‌ వేస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానమెవరిస్తారు? బూటకపు ప్రజాస్వామ్య నాటకం ఎన్నినాళ్లు సాగిస్తారు ఏలికలు?
‘1947లో ఆంగ్లేయులు భారతదేశాన్ని వదిలిపోయారు/ ఇపుడు మనదేశం ఆజాదే/ దేశవాసులంతా ఇదే అంటారు కాని,/ నిజంగా మనం ఆజాదీలమేనా?/ మనం ఆజాదీలం కాదు, అదంతా మన భ్రమ/ నీలాకాశంలో ఎగిరే పిట్టలు ఆజాదీలు/ కాని, మనం మన ఇండ్లలోంచి బయటకు రావాలంటేనే భయపడతాం/ రోడ్లమీద ఏ హంతకుడో మనకోసం కాచుకొని కూచున్నాడని/ మనం ఆజాదీలం కాదు, అదంతా మన భ్రమ!’ అంటుంది రీతి అనే కవయిత్రి… ఇదీ మన భారతం
రైతుల గురించి కవులందరు రాస్తారు కవితలు. కాని, రైతుజీవితాన్ని, రైతును ప్రజంట్‌ చేయడంలో వైవిధ్యముంటుంది. అన్నదాత రైతు ‘సేద్యగంధాల సైరికుడు,/ సేద్యబంధాల సైనికుడు’ అంటాడు కవి రాజ్‌ కుమార్‌. ‘లోకుల ఆకలి తీర్చడమే/ తన పరమావధిగా తలుస్తాడు / పదవీ విరమణ ఎరుగని పాంథుడు/ వ్యవసాయాన్ని వ్యసనంగా భావించిన వాడు’ అని రైతుని కవి వర్ణించాడు.
భారత్‌లోని మొత్తం సంపదలో 40 శాతం కేవలం ఒకశాతం ధనవంతుల దగ్గరే ఉందని, అట్టడుగున ఉన్న సగం జనాభా వద్ద దేశ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే ఉందని ప్రముఖ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ‘సర్వైవల్‌ ఆఫ్‌ ది రిచెస్ట్‌’ పేరిట భారత్‌లోని ఆర్థిక అసమానతలపై సోమవారం నివేదిక తెలియచేసింది.
అదేమాట కవి కరిపె రాజ్‌ కుమార్‌ ‘జ్వాలాలేఖిని’ అనే కవితలో…
‘అధికాదాయ/ అల్పజన సమూహాలు/ అల్పాదాయ/ అధిక జనసందోహాలను అధికధరలతో ఆటలాడించవచ్చు, అప్రకటిత కుట్రలతో క్రీడించి ఓడించనూవచ్చు’ అంటాడు.
ఈనాడు దేశమంతటా వివక్షలు పెచ్చరిల్లాయి. మనుపెన్నడు లేని కుల, మత, జాతి, ప్రాంత వివక్షలు మనిషికి, మనిషికి మధ్య అంతరాలెక్కువై పోయాయి. మనుషులంతా ఒక్కటే అనే నినాదం చెల్లనిదైపోయింది… వసుధైక కుటుంబకమ్‌ అక్కరకు రాని హితవు.
‘నానా నాగరికతా పాయల నడుమ/ అనాగరిక కలుపుమొక్కగా అంకురించి/ విస్తరిల్లిన ఓ వివక్షతా విషవృక్షమా! మానవతను ఎన్నాళ్లు ఓడిస్తావ్‌?’ అని నిగ్గదీసి అడుగుతున్నాడు తన అగ్గిపదాలతో.
ఆజాదీ కవితాసంకలనం కవి ప్రాపంచిక దృక్పథానికి నిదర్శనం. కరిపె రాజ్‌ కుమార్‌ తానున్న సమాజాన్ని విశ్లేషించాడు. విషాల్ని గుర్తించాడు. విరుగుడుల్ని వివరించాడు. తనది మానవతావాదం. తన కవిత్వం సమస్తదుర్మార్గాల మీద సత్యాగ్రహం.