నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత, జౌళి శాఖ జిల్లా అధికారిగా చేనేత, జౌళి రీజినల్ డైరెక్టర్ బి పద్మ (ఫుల్ అడిషనల్ ఛార్జ్) బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె నవతెలంగాణ తో మాట్లాడుతూ ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ నేతన్న పథకం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. గతంలో మూడు సంవత్సరాల కాల వ్యవధి ఉన్న ఈ పథకం రెండు సంవత్సరాలకే వర్తిస్తుందన్నారు. చేనేత కార్మికుల వారి వేతనంలో 8 శాతం జమ చేసినట్లయితే ప్రభుత్వం 16 శాతం వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. మర మగ్గం కార్మికులు వారి వేతనంలో 8 శాతం జమ చేస్తే ప్రభుత్వం ఎనిమిది శాతం ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం నిధులను రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారి సేవింగ్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ నేతలకు భద్రత… ఈ పథకం 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు గల చేనేత, మరమగ్గాల కార్మికులు మరణించినట్లయితే వారి నామినీకి ఎల్ఐసి ద్వారా ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుందన్నారు. 59 సంవత్సరాలు పైబడిన గల చేనేత, మర మగ్గాల వృత్తి పై ఆధారపడిన కార్మికులను ద్వారా టెస్కో ద్వారా ఐదు లక్షల వారి నామీనికి ఇవ్వడం జరుగుతుందన్నారు. తెలంగాణ నేతన్న భరోసా… ఈ పథకంలో జియో ట్యాగ్ నెంబర్ కలిగిన చేనేత కార్మికులకి సంవత్సరానికి 18 వేల రూపాయలు, అనుబంధ కార్మికునికి అరువేల రూపాయలు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. పై మూడు పథకాలు ఫిబ్రవరి 1 నుంచి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.