– డబ్బుల కోసం దారుణానికి సిద్ధమైన తండ్రి
నవతెలంగాణ – జడ్చర్ల
డబ్బుల కోసం కన్న తండ్రి ముగ్గురు పిల్లలను అంగట్లో అమ్మకానికి పెట్టాడు.. విషయం తెలిసి అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం తో పిల్లలను రక్షించారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా భూత్పుర్ మండలం తాడిపర్తి గ్రామంలో వెలుగుజూసింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రఫీయొద్దీన్‌కు జడ్చర్ల పట్టణానికి చెందిన హబీబాతో వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. కాగా రఫీ కుటుంబంతో జడ్చర్ల పట్టణంలోని గౌరీశంకర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య ఆస్తుల గొడవలు జరుగుతున్నాయి. కాగా ఆదివారం ఉదయం ముగ్గురు పిల్లలను తీసుకొని ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. అక్కడ రూ.9 లక్షలకు పిల్లలను అమ్మకానికి పెట్టాడని, తనకు అత్తవారి ఇంటి నుంచి రావలసిన సొమ్ము, ఆస్తి పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. భార్య హబీబా పోలీసులను ఆశ్రయించగా.. వారు రంగం లోకి దిగి రఫీ ఫోన్ సిగల్ ఆధారంగా అతను హైదరాబాద్ లో ఉన్నట్టు గుర్తించారు. పిల్లల ను రక్షించి తల్లికి అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తు న్నారు. రఫీ మాత్రం.. పిల్లలకు బట్టలు, చెప్పులు ఇప్పించేందుకు తీసుకెళ్లినట్టు చెబుతున్నాడు.