– వీధి కుక్కల బెడదతో ప్రజలు బెంబేలు
– గ్రామాల్లో స్వేర విహారం
నవతెలంగాణ-ముదిగొండ
మండలంలోని వివిధ గ్రామాల్లో (గ్రామ సింహాలు) కుక్కలు సంచారంతో ప్రజలు పరేషాన్ అవుతూ బెంబేలు లేత్తుతున్నారు. వామ్మో కుక్కలు బాబోయ్… కుక్కలు అంటూ గ్రామాల్లో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో కుక్కలు స్వేర విహారం చేస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రాత్రిపూట వెళ్లే వాహనాలను కుక్కలు వెంబడిస్తూ వాహనదారులపై దాడి చేస్తున్నాయి. ఒంటరిగా వెళ్లే వాడితో పాటు, స్కూల్‌కి వెళ్లే పిల్లలను వెంటపడి కరుస్తున్నాయి. మండలంలోని కుక్క కాటుకు గురై అనారోగ్యం పాలైన వారు ఎంతో మంది ఉన్నారు. కుక్క కాటుకు ఏమి కాదులేని, నిర్లక్ష్యం చేసి ఇంజక్షన్ చేయించుకోపోతే మత్యువాత పడినవారు కూడా ఉన్నారు. గ్రామాలలో ఇటీవల కాలంలో కుక్కలు బెడద అధికంకావడంతో గ్రామస్తులు జాగ్రత్తలు తీసుకుంటున్న కుక్కలు బారిన పడక తప్పడం లేదు. వీధి కుక్కలు గ్రామ గ్రామాన భారీగా ఉండటంతో స్థానికులు విస్తుపోతున్నారు. ఒంటరిగా ఉన్న చిన్నారులపై వీధి కుక్కలు వెంటబడి, తరుముతూ దాడి చేసి చంపటంతో ఇటీవల కాలంలో కుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై అగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి వీధి కుక్కల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.