బాబు సర్కార్‌ భూబాగోతం

బాబు సర్కార్‌ భూబాగోతం– 28న హైకోర్టు విచారణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన వేల కోట్ల రూపాయల విలువైన భూములను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ఐదు రోజుల కంపెనీకి కట్టబెట్టిన భూబాగోతంపై హైకోర్టు ఈనెల 28న విచారణ చేపట్టనుంది. హైదరాబాద్‌లో కోట్ల రూపాయల విలువైన 855 ఎకరాలు, నగరంలోని పలు స్టేడియాలను ఐఎంజీ భరత్‌ అనే కంపెనీకి ఉమ్మడి ఏపీలో 2003లో నాటి సీఎం చంద్రబాబు అప్పగించారు. ఈ వ్యవహారంపై సీబీఐకి అప్పగించాలని కొందరు, ఆ భూముల సేల్‌డీడ్‌లను ఉమ్మడి ఏపీలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఐఎంజీబీ కంపెనీ సవాల్‌ చేసిన పిటిషన్లను హైకోర్టు విచారణ సమయంలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసింది. భూముల రిజిస్ట్రేషన్లను వైఎస్‌ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అత్యంత ఖరీదైన భూములను ధారాదత్తం చేసేందుకు బాధ్యులైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒక ప్రయివేటు కంపెనీకి అడ్డగోలుగా భూములను అప్పగించారని చెప్పి భూములను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం ఆ తర్వాత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగింది. భూములను ఏకపక్షంగా అప్పగించిన బాగోతం వెనుక దోషులు ప్రభుత్వంలోనే ఉన్నారని వ్యాఖ్యానించింది. ఈనెల 28న జరిగే విచారణ సమయంలో వివరాలు అందజేయాలంటూ చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరథే, జస్టిస్‌ జె అనిల్‌ కుమార్లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైదరాబాద్‌ గచ్చిబౌలి, హైటెక్‌ సిటీకి సమీపంలోని 850 ఎకరాలు, జూబ్లిహిల్స్‌లో ఐదెకరాలు, హెదరాబాద్‌లోని వేల కోట్ల విలువైన పలు స్టేడియాలను ఐఎంజీ అకాడమీ ఆఫ్‌ భారత్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థకు కారుచౌకగా అప్పగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2003 ఆగస్టు తొమ్మిదిన ఎంవోయూ చేసుకుంది. దీనిని రద్దు చేస్తూ వైఎస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఐఎంజీబీ దాఖలు చేసిన పిటిషన్‌, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని దాఖలైన మరో రెండు పిటిషన్లపై విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
ఐదు రోజుల కంపెనీతో భారీ ఒప్పందం
చంద్రబాబు సర్కార్‌ 2003 ఆగస్టు తొమ్మిదిన ఐఎంజీ భరత్‌తో ఒప్పందం చేసుకుంది. అంతకు ముందు కేవలం ఐదు రోజుల ముందు (ఆగస్టు ఐదున) ఐఎంజీ భరత్‌ కంపెనీ రిజిస్టర్‌ అయ్యింది. కంపెనీ ఏర్పాటుకు ఎంఓయూకు మధ్యలో కేవలం మూడు రోజులే గడువు ఉంది. ఐదు రోజుల వయసున్న బినామీ లేదా బోగస్‌ కంపెనీతో చంద్రబాబు ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. టెండర్లు ఏమీ లేకుండా బంజారాహిల్స్‌ నుంచి శిల్పారామం మార్గంలోని మాదాపూర్‌ పరిధిలోకి వచ్చే వేల కోట్ల విలువ చేసే భూమిని, సెంట్రల్‌ యూనివర్సిటీ భూమిని నామమాత్రపు ధరకు ఇచ్చేందుకు నిర్ణయించింది. చంద్రబాబు సీఎం హోదాలో యువజన, సాంస్కృతిక, పర్యాటక శాఖ ప్రధాన కార్యదర్శితో కలిసి ఐఎంజీ భరత్‌ సంస్థతో ఒప్పండం చేసుకున్నారు. ఆరు దశల్లో వాళ్ల మధ్య సంప్రదింపులు జరగాల్సి ఉండగా ఒకే ఒక్క రోజులో ఆగమేఘాలపై దస్త్రాలన్నింటికీ అనుమతులు లభించాయి. 2003, నవంబర్‌ 14న నాటి శాసనసభ రద్దయింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం 2004, ఫిబ్రవరి 10న హైదరాబాద్‌ నడి గడ్డలోని వేల కోట్ల రూపాయల విలువైన భూములను ఐఎంజీ భరత్‌కు అప్పగిస్తూ సేల్‌ డీడ్‌ (భూముల్ని రిజిస్ట్రేషన్‌) చేసింది. అప్పటికే ఎకరం భూమి విలువ రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంది. కేవలం రూ.25 వేల నుంచి రూ.50 వేల ధరకే భూముల్ని కట్టబెట్టారు. దీంతోపాటు హైదరాబాద్‌లోని పలు క్రీడా స్టేడియాలను అప్పగింపు వ్యవహారం కూడా ఎంవోయూ చేసుకుంది. స్టేడియాల నిర్వహణకు నిధులు సమకూర్చేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి 55 లక్షల డాలర్లు రాష్ట్రం ఇచ్చేందుకు అంగీకరించింది. రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు, ఉచితంగా విద్యుత్‌, నీరు, డ్రైనేజీ సౌకర్యాలు కూడా కల్పించాలని నిర్ణయించింది. అమెరికాలోని అంతర్జాతీయ క్రీడాభివద్ధి సంస్థ ఐఎంజీతో ఐఎంబీ భరత్‌ సంస్థ అనుబంధమని ఎంవోయూలో పేర్కొంది. ఇది వాస్తవం కాదని అమెరికాలోని ఐఎంజీ సంస్థ వైబ్‌సైట్‌లో ప్రకటించింది. ఎంఓయూకు ముందు ఐఎంజీతో చర్చలు కూడా జరగలేదు. వేలాది కోట్ల రూపాయల భూబాగోతం, భూముల అప్పగింత వ్యవహారంపై 2006లో నాటి వైఎస్‌ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదికలోని సిఫారసుల తర్వాత ఎంవోయూతోపాటు సేల్‌డీడ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది.
ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో జరిగింది
ఇదంతా ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో జరిగిందని రాష్ట్రం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎ సుదర్శన్‌రెడ్డి వాదించారు. ఐఎంజీ అకడమీస్‌ భారత్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ అమెరికాలోని ఐఎంజీ కంపెనీకి అనుబంధ కంపెనీ అని ఎంవోయూలో పేర్కొన్నారనీ, వాస్తవానికి ఐఎంజీతో ఏవిధమైన సంబంధం లేదన్నారు. భూముల వ్యవహారంపై ఒక కంపెనీకి వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టం చేయడం చెల్లదని ఐఎంజీ భరత్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకట రమణ వాదించారు.
ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధమనీ, సేల్‌డీడ్స్‌ రద్దు చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. తదుపరి విచారణ ఈనెల 18కి వాయిదా పడింది.