జైల్లో బాబుకు ప్రాణహాని

Babu's life is in danger in jail– ఏసీబీ కోర్టులో సిద్ధార్థ లూధ్రా వాదనలు
– పూర్తి భద్రత కల్పించామన్న ఏఏజీ సుధాకర్‌రెడ్డి
– తీర్పు నేటికి వాయిదా
– పిటి వారెంటు కోసం పిటీషన్‌ వేసిన సీఐడీ
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ప్రాణహాని ఉందని అందువల్ల ఆయన్ను హౌస్‌ రిమాండ్‌కు పంపాలని న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా సోమవారం ఏసీబీ కోర్టులో వాదించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో ఆయన చంద్రబాబు తరపున వాదిస్తున్న విషయం తెలిసిందే. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో కరుడుగట్టిన నేరస్తులు, ఆయుధాలు వినియోగించిన వ్యక్తులు శిక్ష అనుభవిస్తున్న విషయాన్ని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. నవలఖా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉదహరించారు. చంద్ర బాబునాయుడికి బెయిల్‌ ఇవ్వాలని, లేదా హౌస్‌ రిమాండుకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు తరుపు న్యాయవాదులు కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రెండో రోజైన సోమవారం కూడా వాద నలు జరిగాయి. చంద్రబాబు తరుపు సిద్ధార్థ లూథ్రా, ప్రాసిక్యూషన్‌ తరుపున ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. తొలుత చంద్రబాబు వయస్సు, ఆరోగ్యం రీత్యా అతనికి హౌస్‌ రిమాండు ఇవ్వాలని కోరారు. రాజమహేంద్రవరంలో కరుడుగట్టిన నేరస్తులు ఉన్న నేపథ్యంలో చంద్రబాబుకు ప్రాణహాని జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. అందువల్లే కేంద్రం కూడా ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పిస్తోందని పేర్కొ న్నారు. దీనిపై ఏఏజీ పొన్నవోలు సుధా కరరెడ్డి జోక్యం చేసుకుని చంద్ర బాబుకు జైల్లో ప్రత్యేక వసతి కల్పించామని, లోపల బయట పూర్తి భద్రత ఉందని పేర్కొన్నారు. జైలు గోడలు 50 అడుగుల ఎత్తులో ఉంటాయని, భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆరోగ్య సమస్య ఉత్పన్నమైతే జైల్లోనే వైద్య చికిత్సకు ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నా రని కోర్టుకు తెలిపారు. ఎంత భద్రత ఉన్నా జైల్లో హత్యలు జరిగిన విష యాన్ని గుర్తించాలని చంద్రబాబు తరుపు న్యాయవాది కోర్టుకు తెలి పారు. అలాగే హౌస్‌ రిమాండుకు అనుమతి ఇవ్వాలని కోరగా సిఆర్‌పిసి చట్టంలో హౌస్‌ రిమాండు అనే విధానం లేదని పొన్నవోలు తెలిపారు. దీనిపై సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకుని గౌతమ్‌ నవలఖా కేసులో సుప్రీం కోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చిందని ప్రస్తావించారు. సాయంత్రం వరకూ సుదీర్ఘంగా వాదనలు వన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును మంగళవారం సాయంత్రానికి వాయిదా వేశారు. అయితే ఉదయంలోపే తీర్పు ఇవ్వాలని సిద్ధార్థ లూథ్రా కోరారు.
రింగురోడ్డు కేసులో కస్టడీ పిటీషన్‌
ఇదే సమయంలో చంద్రబాబునాయుడిపై సిఐడి న్యాయవాదులు మరో పిటీషన్‌ దాఖలు చేశారు. రింగురోడ్డు కేసులో విచారిచేందుకు చంద్రబాబును పిటి(ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌) వారెంటు మీద తమ కస్టడీకి ఇవ్వాలని అందులో కోరారు. దీనిలో చంద్రబాబు మొదటి ముద్దాయిగా ఉన్నాడని, నారాయణ రెండో ముద్దాయని, నారా లోకేష్‌ ఆరో ముద్దాయని కోర్టుకు తెలిపారు. దీనిపైనా విచారణను వాయిదా వేశారు. దీంతో మంగళవారం న్యాయమూర్తి ఏమి తీర్పు ఇస్తారో అనే ఉత్కంఠ నెలకొంది.