గంభీరత మాటున కన్నీటిని అదిమిపట్టే
నా హృదయం ఇప్పుడు అజ్ఞాత అశ్రుసింధువును తలపిస్తోంది
స్వామన్నను కానరాని లోకాలకు
సాగనంపే సందర్భం ఒకటి వస్తుందనుకోలేదు
స్మృతి కవితనొకటి రాయాల్సి వస్తుందనీ
కలలోనైనా తలచలేదు
విధి బలీయమైనదని విన్నాను
కానీ నా నడిపన్నను
ఎత్తుకుపోయేంతదని పసిగట్టలేదు
తనతో కలిసి తిరిగిన క్షణాలన్నీ
మనసు చుట్టూ కవాతు చేస్తున్నాయి
ముఖం వాకిట్లో తెల్లని ముగ్గులా
పరచుకొని ఉండే తన నవ్వు
కాటుగలసి ఎటో పోయింది
నిన్నటి గురుతులలో ఇప్పుడు నేనొక జ్ఞాపకాల బానిసను
దశాబ్దాల ఆత్మీయత నెమరులో
గుక్క పెట్టి ఏడుస్తున్న అమలిన స్నేహాన్ని
పరలోకాన ఉన్న వారిని రంజింపచేయడానికి
మిమిక్రీ ఆర్టిస్ట్ అవసరమయ్యాడా?
అందరి రాతలు రాసే ఆ బ్రహ్మ అలసిపోయి
కొత్త రచయితను వెతుక్కున్నాడా?
కారణమేదో కానీ అక్కడైనా స్వామన్న బాగుండాలి
ఈ లోకంలో పెట్టుకోని దిష్టి చుక్కను
ఆ లోకంలోనైనా పెట్టుకోవాలె
నా ముగ్గురన్నల చిత్రపటానికి మధ్యలో ఇంత పెద్ద తూటు
స్వామన్న కనపడనంతగా.. పెట్టిందెవరో తెలిస్తే
నక్షత్రకుడిలా వెంటపడి అడిగేదాన్ని
నా వెన్నుగర్ర నెందుకు ఎత్తుకుపోయారని
తానుంటాడులే అని పక్కింటికి వచ్చినట్టు
ఊరొదిలి పట్నమొచ్చిన
సభయినా సమావేశమైనా అమ్మలా నా వేలు పట్టుకొని
అండవుతాడనుకుంటే నేలమ్మ కన్నుగప్పి
పేదరాశి పెద్దమ్మలా నింగికి
కథలు చెప్పబోయిండు
పోతే పోనిరు
మూగమబ్బులకు ముచ్చట్లు చెప్పలేక తనే మళ్ళీ వస్తాడు
అప్పటిదాకా స్వామన్నా! నీ యాదిలో మేమంతా జీవిత ఖైదులం
– డాక్టర్ ఉప్పల పద్మ, 9959126682