వెనుకటి గుణమేల మాను..?

వెనుకటి గుణమేల మాను..?ప్రముఖ రచయిత్రి అరుంధతీరారు మీద, కాశ్మీర్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ న్యాయశాస్త్ర మాజీ ప్రొఫెసర్‌ షేక్‌ షౌకత్‌ హుస్సేస్‌లపై ఉన్న పద్నాలుగేండ్లనాటి ఓ కేసును తిరగదోడి, వారి మీద ఏకంగా ‘ఉపా’ చట్టాన్ని ప్రయోగించింది మోడీ సర్కార్‌. వీరిపై విచారణకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా అనుమతించారు. ఎటువంటి విచారణలు లేకుండా సాధ్యమైనంత వేగంగా వీరిని నిర్బంధంలోకి నెట్టేయాలని కేంద్ర పాలకులు ఉత్సాహపడుతున్నారు. అరుంధతీరారు తన ప్రసంగంతో ప్రజలను చైతన్య పరిచిందే కానీ, అధికారపార్టీ నాయకుల్లాగా విద్వేషాలను, భావోద్వేగాలను రెచ్చగొట్టే చవకబారు ఉద్రేకపూరిత ఉపన్యాసాలు ఇచ్చే బాపతు కాదు. ఇప్పటికే ప్రజాస్వామిక వాదులనూ, రచయితలనూ, అంబేద్కరి స్టులనూ ఈ చట్టం కింద జైళ్లల్లో మగ్గపెడుతున్నారు. తాజాగా వీరి వంతు.
”నీ అభిప్రాయాలతో ఏకీభవించక పోవచ్చు… కానీ నీ అభిప్రాయం చెప్పే హక్కు కోసం నా ప్రాణమిస్తా” అంటాడు ఫ్రెంచ్‌ తత్వవేత్త వోల్టేర్‌. ఇది కదా నిజమైన ప్రజాస్వామిక లక్షణం. ప్రజాస్వామ్యమంటేనే భిన్నాభిప్రాయాలను మన్నించడం, ప్రశ్నలను, విమర్శలను గౌరవించడం కదా… ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం మన దేశంలో ప్రజాస్వామ్యమే అమలవుతోందా? అన్న సందేహం రాకమానదు. అత్తెసరు సీట్లతో సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక మిత్రులపై ఆధారపడిన ప్రభుత్వం కాబట్టి, బీజేపీ హిందుత్వ ఎజెండాను పక్కన పెడుతుందని భావించిన వారి ఆశలపై నీళ్లు కుమ్మరించింది మోడీ సర్కార్‌. ‘వెనుకటి గుణమేల మాను..’ అన్నట్టు అధికార పగ్గాలు చేపట్టి పట్టగానే తన కుటిల బుద్ధిని బయటేసుకుంది.
2010లో రాజకీయ ఖైదీల పక్షాన పనిచేసే కమిటీ ఢిల్లీలో ఏర్పాటుచేసిన సదస్సులో వక్తల ఉపన్యాసాలు వేర్పాటువాదాన్ని ప్రొత్సహించేట్టుగా ఉన్నందున దేశద్రోహం కేసు పెట్టాలంటూ ‘రూట్స్‌ ఇన్‌ కశ్మీర్‌ సంస్థ నాయకుడు సుశీల్‌ పండిట్‌ అప్పట్లో ఫిర్యాదు చేశారు. నిజానికి ఆమె ఉపాన్యాసాలతో కాశ్మీరీ ప్రజలు మరింత రెచ్చిపోయి, వేర్పాటువాదం మరికొంత బలపడిన దాఖలాలు ఏమైనా ఉంటే వాటి ప్రభావం ఆనాడే కనిపించివుండేది. అప్పటి ప్రభుత్వాలు ఆమేరకు వారిపై చర్యలు తీసుకొనే ఉండేవి. కానీ, ఇప్పుడు ఆ కాశ్మీర్‌ లేదు. రెండుగా విడిపోయి కేంద్రపాలిత ప్రాంతంగా మిగిలింది. ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయిన తరువాత అది ఎంతో బాగుపడిందని చెబుతున్న బీజేపీ పెద్దలు, ఇప్పటి పరిస్థితులతో సంబంధం లేని దశాబ్దంన్నర నాటి ఓ కేసును ఎందుకు తవ్వితీస్తున్నారు? తద్వారా తమ ఎజెండాను తాము వదలబోమన్న సందేశాన్ని సమాజానికి ఇవ్వదలిచారా?
ఇప్పటికే పలు అంతర్జాతీయ ప్రజాస్వామ్య సూచిల్లో అట్టడుగున ఉన్న మనం.. ఇలాంటి చర్యల ద్వారా మరింత దిగజారుతామని వేరే చెప్పాల్సిన పని లేదు. అరుంధతీరారు ఒక బలమైన ప్రజాస్వామిక గొంతు కనుకనే మూడేండ్ల శిక్ష పడే సెక్షన్లను తీసివేసి, వెంటనే అరెస్టుచేసి జైలో పెట్టి ఏడేండ్లకుపైగా శిక్షపడే ‘ఉపా’ను వారు ఎంచుకున్నారు. అంటే ప్రజల పట్ల ప్రశ్నించే గొంతులంటే వారికి ఎంత భయమో ఈ చర్యల ద్వారా అర్థమవుతుంది. వారు సమూలంగా ప్రక్షాళన చేశామంటున్న కాశ్మీర్‌లో ఉగ్రవాదం తిరిగి బుసకొడుతున్న పరిస్థితులను చూస్తున్నాం. ‘ఉపా’ను సుప్రీంకోర్టు అంగీకరించదని తెలిసి కూడా, సుదీర్ఘకాలం తరువాత న్యాయస్థానంలో ఏమి తేలనప్పటికీ, ఆ లోగా గిట్టనివారిని కాల్చుకుతినేందుకు ఈ చట్టం బాగా ఉపకరిస్తుంది వీరికి. ఇది వీరి ఫాసిస్టు అంత: స్వరూపానికి నిదర్శనం.
ప్రశ్నించే గొంతులను ఏమాత్రం వదిలిపెట్టబోమన్న బలమైన హెచ్చరిక ఈచర్య. నేడు దేశంలో ప్రజాస్వామ్యం ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడానికి మచ్చుకి ఇదో ఉదాహరణ. కేవలం ఒక అభివ్యక్తికి కూడా అవకాశం లేని ఈ ప్రజాస్వామ్యానికి అర్థమేమిటి? దేశం పట్ల నిజమైన ప్రేమ ఉన్నవారంతా ఆలోచించాల్సిన అంశమిది. అయినా నిజాలు గుర్తించలేకపోవడం, గుర్తించినా మభ్యపెట్టాలని చూడటం అభ్యంతరకరం, అనైతికం అవుతాయిగానీ, నిజాలు మాట్లాడటం తప్పెలా అవుతుంది? అభిప్రాయాలు వెల్లడించడం, ప్రశ్నించడం, విమర్శించడమే నేరమైతే అది ప్రజాస్వామ్యమెలా అవుతుంది? ఈ ప్రాథమిక సూత్రాన్ని కూడా నిరాకరించే నిరంకుశ పోకడలే ఈ దేశం పరువు తీస్తున్నాయనే సత్యాన్ని పాలకులకు ఎవరు చెప్పాలి? ఉపా చట్టం కిందనే అక్రమంగా జైలులో పెట్టిన ప్రబీర్‌, ప్రొఫెసర్‌ సాయిబాబాలను సర్వోన్నత న్యాయస్థానం అన్యాయమంటూ ఇటీవలే విడుదల చేసింది. అయినా, బుద్ధి మారలేదు. ఇలాంటి వ్యవహారాల పట్ల ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.