– నెతన్యాహు పర్యటనకు వ్యతిరేకంగా గళమెత్తిన అమెరికన్ యూదులు
వాషింగ్టన్: అమెరికాలో నెతన్యాహు పర్యటనను వ్యతిరేకిస్తూ యూదు శాంతి కార్యకర్తలు మంగళ, బుధవారాల్లో ఇక్కడి కేపిటల్ హిల్స్ ఎదుట పెద్దయెత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘జ్యూయిష్ వాయిస్ ఫర్ పీస్’ బ్యానర్‌పై జరిగిన ఈ ప్రదర్శనలో నెతన్యాహు యుద్ధ నేరస్తుడని, ఆయన కోసం పన్నుచెల్లింపుదారుల సొమ్ము ఒక్క సెంట్ కూడా వెచ్చించకూడదని నిరసనకారులు నినదించారు. ఈ సందర్భంగా వందలాది మంది కార్యకర్తలను కేపిటల్ పోలీసులు అరెస్టు చేశారు. అమెరికన్ పార్లమెంటునుద్దేశించి ఇజ్రాయిల్ ప్రధాని బుధవారం మాట్లాడారు ‘నాట్ ఇన్ మై నేమ్’ అన్న సందేశంతో కూడిన ఎరుపు టీషర్టులు ధరించిన నిరసనకారులు గాజాలో ఊకచోతను తీవ్రంగా ఖండించారు. ఇంత జరుగుతున్నా ఇజ్రాయిల్‌కు ఆయుధాలు, నిధులు అందజేస్తున్న బైడెన్ ప్రభుత్వ చర్యల్ని వారు తప్పుబట్టారు. అందరికీ స్వేచ్ఛ లభించేంతవరకు ఎవరూ స్వేచ్ఛగా ఉండలేరు అని యూదులు అమెరికన్ కాంగ్రెస్‌నుద్దేశించి రాసిన వారు పిలుపునిచ్చారు. యుద్ధ నేరాలకు గాను నెతన్యాహును అరెస్టు చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసిసి) చీఫ్ ప్రాసిక్యూటర్ కోరిన రెండు మాసాలకు నెతన్యాహు అమెరికా పర్యటనకు రావడం గమనార్హం.