– ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి
– ఎఫ్డీసీ మాజీ చైర్మెన్ ప్రతాప్ రెడ్డి
నవతెలంగాణ- గజ్వేల్
బీజేపీ బడే బాయి మోడీ, కాంగ్రెస్ చోటే బారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు త్రీవ మోసం చేశారని ఎఫ్డీసీ మాజీ చైర్మెన్ ఒంటేరు ప్రతాపరెడ్డి విమర్శించారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో నిధులు ఇవ్వాలని తరచుగా పీఎం నరేంద్ర మోడీని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మంత్రులు కలిసి మాట్లాడితే ఒక నయా పైసా ఇవ్వలేదని విమర్శించారు. సీఎం కూర్చి పదిలం కోసం మోడీని రేవంత్ రెడ్డి కలిసినట్లు విమర్శించారు. తెలంగాణ బడ్జెట్ కోసం కాదని తేలిపోయిందన్నారు. ఐదేండ్లు సీఎం సీటు భద్రంగా ఉంచే విధంగా చూడాలని మోడీని పలుసార్లు కలిసి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు ఉందని ఆరోపించారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచి బడ్జెట్లో సాధించింది ఏముందని పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ సభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీల్లో ఇద్దరు కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజరు మంత్రి పదవులు ఇస్తే చాలు అని మోడీకి చెప్పినట్లుందన్నారు. వెంటనే కేంద్ర మంత్రి పదవులకు కిషన్ రెడ్డి, బండి సంజరులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు నయా పైసా బడ్జెట్లో తీసుకురాని మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పటాన్చెరుకు మెట్రో చేస్తా, రైలు తెస్తా గొప్పలు చెప్పిన రఘునందన్ రావు ఇప్పుడు ఏమి మాట్లాడుతాడని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మెన్ నేతి చిన్న రాజమౌళి, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మాదాసు శ్రీనివాస్, మల్లేశం, మద్దూరు శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డి, నర్సింగారావు, జాఫర్ ఖాన్, లక్ష్మీ కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.