తొలినాళ్ళ నుండి బాలల కోసం సాహిత్యం అనగానే భాగవతంలోని శ్రీకృష్ణ లీలలు, సుమతి శతకం, శ్రీకృష్ణ శతకం, రామరామ శతకంతో పాటు వేమన శతకాలు అందించేవారు, పద్యాలను పిల్లలతో కంఠస్థం చేయించేవారు. తరువాత ‘తెలుగుబాల’ శతకంతో పాటు అనేక మంది ఆధునికులు రాసిన శతకాలు ఇటీవల వరకు మనం చదువుకున్నాం. వాటిని నేటి తరానికి కొత్తకోణంలో పరిచయం చేసిన కథారచయిత, విమర్శకుడు, బాల వికాస యజ్ఞంలో సాగుతున్న సృజనకారుడు, బాల సాహితీవేత్త డా||బి.వి.ఎన్.స్వామి.
డాక్టర్ స్వామి డిసెంబర్ 16, 1964న కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలోని వరికోలు గ్రామంలో పుట్టారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి లక్ష్మీదేవి, శ్రీ అనంతస్వామి. వృత్తిరీత్యా పాఠశాల ప్రధానో పాధ్యాయులుగా పనిచేస్తున్న డా||స్వామి ప్రవృత్తిరీత్యా కథారచయిత, విమర్శకులు. కథలు తాను స్వయంగా రాయడమే కాక పిల్లలకు రాయడంలో శిక్షణనిస్తున్న స్వామి రెండు కథా సంపుటాలు ప్రచురించారు. అవి ‘నెల పొడుపు’, ‘ఒక మెలకువ’ పేరుతో అచ్చయ్యాయి. కథా విమర్శకులుగా గుర్తింపు పొందిన డా||స్వామి ‘వివరం’ పేరుతో తెలుగు కథకులు, కథలను పరిచయం చేశారు. తెలంగాణ తొలితరం కథకుల నుండి ఆధునికుల వరకు, వారి కథలపై సాధికారికంగా రాసిన విమర్శా వ్యాసాలు ‘కథా తెలంగాణం’. ఇవేకాక 224 మంది ఉత్తర తెలంగాణా కథారచయిల కథలను పరిచయం చేస్తూ తెచ్చిన గ్రంథం ‘అందుబాటు’. ఇది అచ్చంగా పుట్టిన మట్టి ఋణం తీర్చుకునే తండ్లాట వంటిది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ‘ఉత్తర తెలంగాణ కథా సాహిత్యం-పరిశీలన’ అంశంపై పరిశోధన చేసి డాక్టరేటు పొందిన డా||స్వామి కథకు కట్టుబడి నడుస్తున్న రచయిత. ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సందర్భంలో వచ్చిన తొలి కథాసంకలనం డా||స్వామి సంపాదకత్వంలో వచ్చిన ‘తెలంగాణ చౌక్’. స్వామి సంపాదకత్వంలో వచ్చిన మరో రెండు కథాసంకలనాలు ‘పంచపాల’, ‘కుదురు’ పేరుతో వచ్చిన కరీంనగర్ కథలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ ఉన్నత పాఠశాల సాంఘికశాస్త్రం, తెలుగు పాఠ్య పుస్తకాల రచయితగా రచనలో పాల్గొన్నారు. సాహితీ గౌతమి మొదలుకుని కరీంనగర్ జిల్లాలోని వివిధ సాహిత్య సాంస్కృతిక సంస్థల్లో బాధ్యులుగా, సన్నిహితులుగా ఉన్న డా||బి.వి.ఎన్. స్వామి వివిధ సంస్థల పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. 2014 సంవత్సరంలో ‘కథా తెలంగాణం’ విమర్శా గ్రంథానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘సాహిత్య పురస్కారం’ అందుకున్నారు. ఇవాళ్ల తెలంగాణలో గరిపెల్లి అశోక్ సారథ్యంలో జరుగుతున్న బాలల వికాస కథాకార్యశాల గురించి తెలిసిందే. సిరిసిల్ల మొదలుకుని తెలంగాణ సారస్వత పరిషత్ కార్యశాలల వరకు జరిగిన దాదాపు అన్ని కథాకార్యశాలల్లో విషయ నిపుణులుగా పాల్గొన్నారు స్వామి.
బాలల కోసం సాహితీవేత్తలు తమతమ అభిరుచుల నేపథ్యంలో అనేక రచనలు, ప్రయోగాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. ఈ కోవలో బాలల కోసం ‘కశప’ పేరుతో ‘కథా శతక పద్యం’ పుస్తకాన్ని తెచ్చారు బి.వి.ఎన్.స్వామి. బాలల కోసం కథలు, వ్యాసాలు, నాటికలు రాసిన స్వామి మల్లికార్జున పండితారాధ్యుని ‘శివ తత్వసారం’ తెలంగాణ శతకం దాకా దాదాపు 117 పద్యాలకు చక్కని కథలను బాలల కోసం ప్రయోగంగా రాసి అచ్చులోకి తెచ్చారు. ఇందులోని తొలి పద్యమైన ‘ఒడలు, గుడి….’ మొదలుకుని చివరి పద్యంగా పేర్కొన్న ‘బ్రతుకు నిచ్చెటి బతుకమ్మ’ వరకు ప్రతి పద్యానికి తనదైన ఒక ప్రణాళికను, కాల్పనికతను, వివిధ పద్యాలకు అనుగుణంగా తనదైన కల్పనతో కథలను కూర్చారు రచయిత స్వామి. వేమన పద్యాలు, సుమతి పద్యాలు ఇలా ఒక్కటని కాదు అనేక శతకాల పద్యాలు ఆయన ‘కశప’లో భాగమయ్యాయి. వేమన శతకంలోని ‘నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకు బెలుకు రాళ్ళు తట్టెడేల’ అనే పద్యం మనకు తెలుసు. ఈ పద్యానికి మన పాఠశాలలు, విద్యా వ్యవస్థలకు అన్వయించి మన విద్యారంగంలోని కృత్రిమ వాతావరణాన్ని నిరసిస్తారు. ప్రేమ వివాహాలను గురించి చెబుతూ సుమతి శతకం లోని ‘కూరిమిగల దినములలో/నేరము లెన్నడును గలుగ నేరవు…’ అనే పద్యం నేపథ్యంతో వివరిస్తారు. మరో ప్రసిద్ధ పద్యం ‘వేము పాలు బోసి వెయ్యేండ్లు పెంచిన/ చేదు విడిచి తీపి చెందనటుల…’ అనే వేమన పద్యంతో వ్యక్తుల మనస్తత్వాన్ని వివరించే ప్రయత్నం చేశారు స్వామి. వృషాధిప శతకంలోని అంబలి పద్యాన్ని తీసుకుని ఒక వైద్యుడు నిర్వహించే అంబలి కేంద్రానికి సమన్వయం చేసి రాశారు. తల్లిదండ్రులను పట్టించుకోని పుత్రుల గురించి రాస్తూ దానిని దూర్జటి పద్యం ఆధారంగా కొత్తగా చెప్పారు. ‘తను’ అనే కుమారీ శతక పద్యాన్ని చేనేత కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో చూపించారు రచయిత బి.వి.ఎన్.స్వామి. తాను రాసిన కథకు పద్యాన్ని చేర్చి, అది బాలబాలికలకు, పెద్దలకు చక్కగా చేరేట్టు చేయడంలో ఈ ‘కశప’ విజయవంతమైంది.
– డా|| పత్తిపాక మోహన్
9966229548
శతక పద్యాల కథల బద్దెన
9:51 pm